పాన్ ఇండియా స్టార్‌గా తన ఇమేజ్‌కు తగిన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఆయన ఖాతాలో ప్రస్తుతం ‘ఆది పురుష్’, ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ వంటి చిత్రాలున్నాయి. ఇవన్నీ నిర్మాణపరంగా ప్రతిష్టాత్మక సినిమాలే. వీటిలో ‘ఆది పురుష్’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటుండగా.. మిగతా రెండు చిత్రాలు రెగ్యులర్ షూటింగ్లో ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ మినీ షెడ్యూల్లో ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించాల్సిన ‘స్పిరిట్’ సినిమా ప్రీ ప్రొడక్షన్ త్వరలో ప్రారంభం కానుంది.
ఆదివారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన బర్త్ డే డీపీలు ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ప్రాజెక్ట్ కె’ నుంచి ఒక స్పెషల్ అప్డేట్ ఇస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ వెల్లడించారు. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అభిమానులకు దీన్ని అందిస్తామని చెప్పారు. మిగతా రెండు చిత్రాలు ‘సలార్’, ‘ఆది పురుష్’ నుంచి కూడా కొత్త సంగతులు తెలియజేసే అవకాశముంది. వ్యక్తిగతంగా ప్రభాస్ ఈసారి తన పుట్టినరోజు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పెదనాన్న రెబల్‌స్టార్ కృష్ణంరాజు కొద్ది రోజుల క్రితం దివంగతులు అయినందువల్ల ఈసారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదు. ఇవాళ్టితో ప్రభాస్ తన 43వ ఏట అడుగుపెడుతున్నారు.