Hari Hara Veeramallu | పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఎదురుచూసే అభిమానులకు ఊరట కలిగిస్తూ, చాన్నాళ్ల తర్వాత ఆయన నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రపంచవ్యాప్తంగా జూలై 24న విడుదలకు సిద్ధమైంది. సుమారు ఐదేళ్లుగా వాయిదాల మధ్య సాగిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్, ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో ఈ ప్రాజెక్టుపై ఉన్న నిరుత్సాహం ఒక్కసారిగా తలకిందులైంది. 24 గంటల్లోనే ఈ ట్రైలర్ అత్యధిక వ్యూస్ సొంతం చేసుకొని, ‘పుష్ప 2’ రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక ధర్మ యోధుడిగా, చారిత్రక పాత్రలో కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడు. ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరిట ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్‌కు ముహూర్తం దగ్గరపడుతుండటంతో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు వైజాగ్‌లోను గ్రాండ్‌గా ఓ కార్యక్రమం జరపనుంది. ఈవెంట్‌ను వైజాగ్‌లోని బీచ్ రోడ్ వద్ద ఉన్న ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు.
ఈ రోజు సాయంత్రం 4గం.లకి ఈవెంట్ ప్రారంభం కానుండగా, కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరు కానుంది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో సందడి చేయనున్నట్టు తెలుస్తుంది. తొలుత తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల లొకేషన్ మార్చారు. ఈవెంట్‌కి పవన్ అభిమానులు, జనసైనికులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, మేకర్స్ అన్నీ ఏర్పాట్లు జాగ్రత్తగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తుండటంతో, ఆయన సినిమాకు క్రేజ్ మరింత పెరిగింది. అందుకే అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు తో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.దర్శకత్వాన్ని క్రిష్ జాగర్లమూడి & జ్యోతి కృష్ణ సంయుక్తంగా నిర్వహించగా, ఏఎం రత్నం సమర్పణలో, ఆయన సోదరుడు దయాకర్ రావు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.