‘నా జీవితంలో ఏదీ తేలిగ్గా దొరకలేదు. నా జీవితం వడ్డించిన విస్తరి కానేకాదు. విజయాలు కూడా కష్టపడితేనే కానీ నాకు రాలేదు. ‘హరిహర వీరమల్లు’ కూడా అలాంటి విజయమే. సక్సెస్‌లు, రికార్డుల గురించి పట్టించుకోవడం మొదట్నుంచీ నాకు అలవాటు లేదు. సినిమాను కొందరు బాయ్‌కాట్ చేస్తాం అంటున్నారు. నెగెటివ్ రివ్యూలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్లను బెదరను’ అన్నారు పవన్‌కల్యాణ్. ఆయన కథానాయకుడిగా నటించిన హిస్టారికల్ ఫిక్షన్ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వంలో, ఏ.ఎం.రత్నం సమర్పణలో, ఏ.దయాకరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ గురువారం విడుదలైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘నేను ఒక సినిమా చేస్తే ఆ సినిమా మిమ్మల్ని భయపెడుతుందంటే, అది నా స్థాయి. పీరియడ్ ఫిల్మ్ ఇంతకు ముందు చేయలేదు. ఇదో కొత్త అనుభవం. హిస్టరీలో మనం మొఘలుల గొప్పతనం మాత్రమే చదువుకున్నాం. వాళ్లు చెత్త పనులు కూడా చేశారు. ఔరంగజేబు లాంటి వాళ్లు దారుణాలకు తెగబడ్డారు. వాటన్నింటినీ వైట్ వాష్ చేసి మనకు వినిపించారు గత పాలకులు. హిందువులపై వారు విధించిన జిజియా పన్ను గురించి లైట్‌గా టచ్ చేసి వదిలేశారు.
మన శ్రీకృష్ణదేవరాయల్ని, రాణీరుద్రమదేవిని, కాకతీయ, పల్లవ చరిత్రలను మన గత పాలకులు చిన్నచూపు చూశారు అనిపించింది. అందుకే వాటన్నింటి గురించి ఈ సినిమాలో చర్చించేందుకు ప్రయత్నించాం. అందుకని ఇది హిందూ, ముస్లింల మధ్య జరిగే యుద్ధం మాత్రం కాదు. ఒక అరాచకంపై, మత విద్వేషంపై జరిగిన యుద్ధం. ఈ సినిమా పార్ట్ 2 కూడా 30శాతం పూర్తయింది. ఈ సినిమా విడుదలకు సహకరించిన మైత్రీ మూవీమేకర్స్‌కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. టెక్నికల్‌గా కొన్ని సమస్యలుండొచ్చు. దాన్ని సెకండాఫ్‌లో సరిచేసుకుంటాం’ అని అన్నారు. ఇంకా దర్శకుడు జ్యోతికృష్ణ, నిర్మాత ఏ.ఎం.రత్నం, కథానాయిక నిధి అగర్వాల్, మైత్రీమూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యర్నేని, వై.రవిశంకర్ కూడా మాట్లాడారు.