Hanuman Ansh | బాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాల హవా కొనసాగుతున్న సమయంలో ఓ చిన్న భక్తి ప్రధాన చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనం సృష్టిస్తోంది. ‘హనుమాన్ అంశ్’ అనే చిత్రం తొలుత చాలా నెమ్మదిగా ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. మూడో వారం నుంచి అద్భుతమైన పుంజుకుని ఇప్పుడు హిందీ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.కరోనా తర్వాత బాలీవుడ్లో అమలవుతున్న సుదీర్ఘ ఓటీటీ విండో కారణంగా సినిమాలు థియేటర్లలో ఎక్కువ కాలం ప్రదర్శితమయ్యే అవకాశం ఏర్పడింది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి క్రమంగా స్పందన పెరిగి.. వారాల తరబడి బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశం వస్తోంది. ‘హనుమాన్ అంశ్’ విజయప్రయాణం కూడా దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తోంది.
భక్తి ప్రధాన కథాంశంతో రూపొందిన ‘హనుమాన్ అంశ్’ మొదటి రెండు వారాల్లో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. విడుదలైన కొత్త సినిమాలకు స్క్రీన్లు ఇవ్వడంతో ఈ చిత్రానికి థియేటర్ల సంఖ్య కూడా తగ్గింది. తొలి రెండు వారాల్లో ఈ సినిమా సుమారు రూ.1.5 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు అంచనా.అయితే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి క్రమంగా పెరిగింది. మౌత్ పబ్లిసిటీ ఈ చిత్రానికి పెద్ద బలంగా మారింది. మొదట్లో స్క్రీన్లు తగ్గినా.. ప్రేక్షకుల ఆదరణ పెరగడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.అనూహ్యంగా మూడో వారంలో ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద భారీగా పుంజుకుంది. కేవలం ఏడు రోజుల్లోనే సుమారు రూ.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. రెండో వారంతో పోలిస్తే మూడో వారంలో సినిమా వసూళ్లు ఏకంగా 2150 శాతం పెరిగినట్లు అంచనా వేస్తున్నారు.
సాధారణంగా సినిమా విడుదలైన తొలి వారంలో అత్యధిక కలెక్షన్లు రావడం సహజం. కానీ మూడో వారంలో ఇలా భారీగా వసూళ్లు పెరగడం అరుదైన విషయంగా సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.మూడో వారం విజయంతో ‘హనుమాన్ అంశ్’కు మరిన్ని స్క్రీన్లు లభించాయి. నాలుగో వారంలోనూ ఈ సినిమా జోరు కొనసాగుతోంది. నాలుగో శుక్రవారం సుమారు రూ.6 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు అంచనా. ఇక నాలుగో వారాంతం ముగిసే సమయానికి దాదాపు రూ.24 కోట్ల నెట్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి అంచనా లెక్కలు మాత్రమే. సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఎక్కడి వరకు కొనసాగుతుందనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.