Hanuman Ansh | సినిమా విజయం సాధించాలంటే భారీ ఓపెనింగ్స్, స్టార్ హీరోల క్రేజ్ మాత్రమే అవసరం లేదని మరోసారి నిరూపించింది ‘హనుమాన్ అంష్’. పెద్దగా హడావుడి లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ భక్తిరస ప్రధాన చిత్రం.. ప్రేక్షకుల మౌత్ టాక్‌తో క్రమంగా పుంజుకుని ఇప్పుడు ఈ ఏడాదిలోనే చెప్పుకోదగ్గ స్లీపర్ హిట్‌గా నిలిచింది. నీమ్ కరోలి బాబా జీవితం, బోధనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 7, 2026న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు పెద్దగా బజ్ లేకపోవడంతో తొలిరోజు కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొదటి రోజు ఈ సినిమా సుమారు రూ.10 లక్షల నెట్ వసూళ్లు మాత్రమే సాధించినట్లు సమాచారం.
అయితే సినిమా ఫలితం అక్కడితో ఆగిపోలేదు. ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ టాక్ సినిమాకు నెమ్మదిగా బలాన్ని ఇచ్చింది. రోజులు గడిచే కొద్దీ థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుతూ వచ్చింది. కొత్త సినిమాలు విడుదలైనా ‘హనుమాన్ అంష్’ తన స్క్రీన్లను, ప్రేక్షకులను నిలబెట్టుకోవడం విశేషంగా మారింది. విడుదలైన 25వ రోజున కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తన ప్రభావాన్ని చూపిస్తోంది. తాజా బుక్‌మైషో డేటా ప్రకారం.. గత 24 గంటల్లో ‘హనుమాన్ అంష్’కు ఏకంగా 1,68,690 టికెట్లు బుక్ అయ్యాయి. ఇదే సమయంలో ప్రస్తుతం థియేటర్లలో ఉన్న రవితేజ ‘ఇరుముడి’ సినిమాకు 1,39,430 టికెట్లు, యశ్ నటించిన ‘టాక్సిక్’ చిత్రానికి 1,19,320 టికెట్లు నమోదైనట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలు ‘హనుమాన్ అంష్’ కంటే చాలా కొత్తగా విడుదలైన సినిమాలు కావడం గమనార్హం.
అంటే.. స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలో కూడా 25 రోజుల క్రితం విడుదలైన ఓ చిత్రం వాటిని మించి టికెట్ బుకింగ్స్ సాధించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది. ‘హనుమాన్ అంష్’ అసలు విజయం దాని కలెక్షన్ల ప్రయాణంలోనే కనిపిస్తోంది. తొలి రోజు కేవలం రూ.10 లక్షల నెట్‌తో ప్రారంభమైన ఈ సినిమా.. మౌత్ టాక్ కారణంగా ప్రతి వారం తన వసూళ్లను పెంచుకుంటూ వెళ్లింది.తాజా లెక్కల ప్రకారం 25 రోజుల్లో ఈ సినిమా భారతదేశంలో సుమారు రూ.45 కోట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.54 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా భారీ అంచనాలతో వచ్చే సినిమాలు మొదటి వారంలోనే ఎక్కువ వసూళ్లు సాధిస్తాయి. కానీ ‘హనుమాన్ అంష్’ విషయంలో దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది. ప్రారంభంలో పెద్దగా కలెక్షన్లు లేకపోయినా.. ప్రేక్షకుల నుంచి వచ్చిన సానుకూల స్పందనతో రెండో వారం, మూడో వారం, నాలుగో వారంలోనూ సినిమా నిలకడగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లతో ప్రారంభమైన ఈ చిత్రం.. 25 రోజుల్లో రూ.45 కోట్ల నెట్, సుమారు రూ.54 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌కి చేరుకోవడం నిజంగా ఆసక్తికరమైన పరిణామం.