‘గుర్తుందా శీతాకాలం’ చాలా అరుదైన సినిమా . ఇలాంటి సినిమా ఈ వయసులో చేయలేకపోతే ఆ తరువాత చేయలేం. కాలేజీ సన్నివేశాలు ఉన్నాయని తెలుసుకుని ఈ సినిమా చేశా’ అన్నారు హీరో సత్యదేవ్. ఆయన నటించిన తాజా చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం సత్యదేవ్ పాత్రికేయులతో ముచ్చటించారు.
సత్యదేవ్ మాట్లాడుతూ ‘మన జీవితంలోని మొదటి ప్రేమను, అందమైన రొమాంటిక్ క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేము. అటువంటి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమా అందరి ముందుకొస్తుంది. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేశారు దర్శకుడు. స్కూల్, కాలేజ్, ఆ తరువాత మిడిల్ ఏజ్ ఇలా అన్ని వేరియేషన్స్ల్లో నటించే అవకాశం రావడం చాలా అరుదు.
లవ్‌స్టోరీస్‌తో వచ్చే సినిమాలు యూనివర్సల్. అవి ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ మధ్యే వచ్చిన సీతారామం, లవ్‌టుడే వంటి సినిమాలను ఆదరించినట్లే ఇప్పుడు మా సినిమాను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు.