‘నిర్మాతగా ఇప్పటివరకు ఎనభై మూడు సినిమాలు తీశాను. అన్నింటికంటే ‘గాడ్సే’ విషయంలో చాలా గర్వంగా ఫీలవుతున్నా. నేటి సమాజానికి మంచి సందేశాన్నందించే చిత్రమిది’ అన్నారు సి.కల్యాణ్. ఆయన నిర్మాతగా సత్యదేవ్ టైటిల్ రోల్‌ని పోషించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాబి దర్శకుడు. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘సత్యదేవ్ నటనలో భిన్న పార్శాల్ని కనబరిచాడు.
మా బ్యానర్లో గొప్ప చిత్రమవుతుంది’ అన్నారు. ‘ఈ దేశంలో అతి కొద్ది మంది మాత్రమే వారు చదివిన చదువుకి సరైన అర్హత ఉన్న ఉద్యోగం చేస్తున్నారు. మిగతా వాళ్లు ఏదో సర్దుకుపోతున్నారు. నేడు మనందరి మనసుల్లో నిక్షిప్తమై ఉన్న ప్రశ్నల్ని ఈ గాడ్సే సంధించబోతున్నాడు. ఈ సినిమాలో సామాజిక సమస్యను చర్చించాం’ అని దర్శకుడు తెలిపారు. సత్యదేవ్ మాట్లాడుతూ ‘ నేటి యువత కోసం చేసిన సినిమా ఇది. చిన్న సమస్యలనుకొని మనం కొన్ని విషయాల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తాం. కానీ అవే పెద్ద సమస్యలుగా మారతాయి. అలాంటి అంశాల్ని ఈ సినిమాలో చర్చించాం’ అన్నారు. వ్యవస్థను, ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నిస్తూ యువతకు సందేశాన్నందించే చిత్రమిదని కె.ఎస్.రామారావు పేర్కొన్నారు.