Ghattamaneni JayaKrishna | తెలుగు సినీ ప్రపంచంలో మరో స్టార్ వారసుడు తెరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని త్వరలో హీరోగా పరిచయం కానున్నారు. ఇక జయకృష్ణ తొలి సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ, సీనియర్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తడానీ ఎంపికైందని సమాచారం. రవీనా టాండన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. బాలకృష్ణతో ‘బంగారు బుల్లోడు’, నాగార్జునతో ‘ఆకాశ వీధిలో’, మోహన్ బాబుతో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ లాంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె కూతురు రషా తడానీ తెరంగేట్రం చేయనుంది.
రషా ఇప్పటికే బాలీవుడ్లో నటన ప్రారంభించింది. జనవరిలో విడుదలైన హిందీ చిత్రం ‘ఆజాద్’ ద్వారా అజయ్ దేవగణ్ కుమారుడు అమన్ దేవగణ్ సరసన కథానాయికగా నటించి, తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఆర్ఎక్స్ 100’, ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ కొత్త జంటను వెండితెరపై పరిచయం చేయనున్నాడు. ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.ఒక్క సినిమాతో రెండు సినీ కుటుంబాల వారసుల్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. జయకృష్ణ డెబ్యూట్, రషా మొదటి తెలుగు సినిమా కావడంతో సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఘట్టమనేని కుటుంబానికి చెందిన జయకృష్ణ, రవీనా టండన్ కూతురు రషా తడానీ కలిసి తెలుగు తెరకు రాబోతుండటంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అజయ్ భూపతి తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జయకృష్ణ తండ్రి రమేశ్‌బాబు 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ‘అల్లూరి సీతారామరాజు’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘దేవుడు చేసిన మనుషులు’ వంటి చిత్రాల్లో బాలనటుడిగా నటించి తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.ఆపై ‘నా ఇల్లే నా స్వర్గం’, ‘అన్నా చెల్లెలు’, ‘పచ్చతోరణం’, ‘సామ్రాట్’, ‘కృష్ణగారి అబ్బాయి’ తదితరంగా మొత్తం 17 చిత్రాల్లో కథానాయకుడిగా కనిపించి ప్రేక్షకులని అలరించారు. రమేశ్‌బాబు తన తమ్ముడు మహేశ్‌బాబుతో కలిసి ‘అర్జున్’, ‘అతిథి’ చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.