Furiosa: A Mad Max Saga | హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సూపర్ హిట్ ఫ్రాంచైజీల్లో ‘మ్యాడ్ మ్యాక్స్’ (Mad Max) ఒకటి. యాక్షన్, అడ్వెంచర్, సర్వైవల్ జానర్లో వచ్చిన ఈ సిరీస్ చిత్రాలు యావత్ సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. 1979లో ‘మ్యాడ్ మ్యాక్స్’ పేరుతో ప్రారంభమైన ఈ ఫ్రాంఛైజీ ఆ తర్వాత 1981లో మ్యాడ్ మ్యాక్స్ 2 (ది రోడ్ వారియర్) 1985లో మ్యాడ్ మ్యాక్స్3 (బియాండ్ థండర్‌డోమ్), 2015లో మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరీ రోడ్) అనే నాలుగు భాగాలుగా వచ్చి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా అలరించింది.
మొదటి మూడు భాగాలలో మెల్ గిబ్సన్ హీరోగా నటించగా నాలుగో చిత్రం ‘మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’లో టామ్ హార్డీ హీరోగా నటించారు. అయితే ఈ ఫ్రాంచైజీ నుంచి తాజాగా మరో చిత్రం రాబోతుంది. ఫ్యూరియోసా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (Furiosa: A Mad Max Saga) అంటూ రాబోతున్న ఈ చిత్రం 2015 లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ (ఫ్యూరీ రోడ్) సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే.. ప్యూరీ రోడ్ లో మెయిన్ రోల్ అయిన ఫ్యూరియోసా (ఛార్లెస్ థెరాన్) ఈ రోడ్ వార్‌లోకి ఎలా వచ్చింది, కింగ్ నుంచి ఐదుగురు భార్యలను ఎందుకు రక్షించిందనే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ కంటే మరింత గ్రాండ్‌గా ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమైపోతుంది. మొదటి నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించిన అస్ట్రేలియన్ డైరెక్టర్ జార్జ్ మిల్లర్ (George Miller) ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమా 2024 మే 24 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమాలో థోర్ ఫేమ్ క్రిస్ హెమ్స్ వర్త్ (Chris Hemsworth) కథానాయకుడిగా నటిస్తుండగా.. ది మెన్ మూవీ ఫేమ్ ఆన్యా టేలర్ (Anya Taylor) ఛార్లస్ థెరాన్ (Charlize Theron) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్యూరీ రోడ్ కు ఫ్రీక్వెల్ గా రానుండగా సీక్వెల్ మ్యాడ్ మ్యాక్స్ (ది వేస్ట్ ల్యాండ్) నెక్స్ట్ పార్ట్ త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.