త్రిష కథానాయికగా మారి 23ఏండ్లు. స్టార్ హీరోయిన్గా ఇంకా సత్తా చాటుతూనే ఉన్నారు త్రిష. హీరోయిన్లలో ఇంతటి లాంగ్విటీ చాలా అరుదు. ఈ విషయంలో త్రిష నిజంగా గ్రేట్. అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక పానిండియా చిత్రం ‘విశ్వంభర’లో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం త్రిష పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘విశ్వంభర’లో తాను పోషిస్తున్న అవని పాత్రను పరిచయం చేస్తూ ఓ స్టిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. రాజసం ఉట్టిపడేలా చీరకట్టులో మెరిసిపోతూ త్రిష ఈ స్టిల్‌లో కనిపించారు. ఈ సినిమాలో త్రిష పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్నదని, విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్‌ని ఈ సినిమా అందించబోతున్నదని మేకర్స్ తెలిపారు. అశికా రంగనాథ్ మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, దర్శకత్వం: వశిష్ట, నిర్మాతలు: విక్రమ్, వంశీ, ప్రమోద్, నిర్మాణం: యూవి క్రియేషన్స్.