ఒకప్పుడు దక్షిణాదిన కథానాయికగా రాణించిన అభిరామి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సత్తా చాటుతున్నది. రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న ‘భలే ఉన్నాడే’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో నటించింది. జె.శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం అభిరామి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘కెరీర్ ఆరంభంలో కొన్ని సినిమాలు చేసిన తర్వాత యుఎస్ వెళ్లి చదువుకున్నా. పెళ్లిచేసుకొని అక్కడే కొన్నాళ్లు సెటిట్ అయ్యాను. ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ బిబీగా మారడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది.
సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘ఇందులో నేను గౌరి అనే బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. మా అమ్మానాన్న కూడా బ్యాంక్ ఎంప్లాయిస్ కావడంతో పర్సనల్‌గా ఈ క్యారెక్టర్‌తో బాగా కనెక్ట్ అయ్యాను. గౌరి సింగిల్ మదర్. బలమైన ఆదర్శాలు కలిగిన మహిళగా కనిపిస్తుంది. మన ఇంట్లో తల్లి, సోదరి తరహాలో దర్శకుడు నా పాత్రను తీర్చిదిద్దాడు’ అని పేర్కొంది. మహారాజ, సరిపోదా శనివారం చిత్రాల్లో తాను పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కిందని, కథ..క్యారెక్టర్ నచ్చితేనే సినిమాలను అంగీకరిస్తున్నానని అభిరామి చెప్పింది. ప్రస్తుతం తమిళంలో లీడ్ రోల్స్‌లో రెండు చిత్రాల్లో నటిస్తున్నానని, తెలుగులో రెండు కథలు విన్నానని, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వివరాలను త్వరలో వెల్లడిస్తానని ఆమె తెలిపింది.