‘సినీరంగంలో కొత్త, పాత అనే భేదాలు ఉండవు. నేను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు నటనకు పనికి రానని చెప్పారు. ఎవరి ప్రస్థానమైనా చిన్నస్థాయి నుంచి మొదలై అగ్రస్థానానికి చేరుతుంది’ అని అన్నారు సీనియర్ నటుడు మోహన్‌బాబు. ‘రుద్రంకోట’ టైటిల్ లుక్ పోస్టర్‌ను గురువారం ఆయన విడుదలచేశారు. సీనియర్ నటి జయలలిత ప్రధాన పాత్రలో నటిస్తూ సమర్పిస్తున్న ఈ చిత్రానికి అనిల్ కండవల్లి నిర్మాత. కోన రాము దర్శకుడు. అనిల్, విభీష జంటగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ‘జయలలితతో ముప్పై ఏళ్లుగా పరిచయం ఉంది. ఈ రోజుకూ తనంటే నాకు గౌరవం, ప్రేమ ఉన్నాయి. ఆ అభిమానంతోనే ఈ వేడుకకు వచ్చా. సమర్పకురాలిగా ఆమె వేస్తున్న మొదటి అడుగు విజయవంతం కావాలి చిన్న నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది’ అని తెలిపారు. జయలలిత మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో కోటమ్మగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో అనిల్, కోన రాము తదితరులు పాల్గొన్నారు.