Dora Sai Teja | యూట్యూబ్ వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై, ప్రస్తుతం ‘దందా’ సిరీస్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న యువ నటుడు దొర సాయి తేజ తన సినీ ప్రయాణం, కష్టాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, ఆ తర్వాత యూట్యూబ్ క్రియేటర్‌గా ఎదిగిన ఆయన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగుతోంది.
చిన్నతనంలోనే ప్రభాస్ ‘అడవి రాముడు’ చిత్రంలో హీరో చిన్నప్పటి పాత్రకు డబ్బింగ్ చెప్పిన సాయి తేజ, ఆ తర్వాత ‘కొత్త బంగారు లోకం’, ‘హై స్కూల్’ సిరీస్‌లతో పాటు ‘అలా మొదలైంది’ సినిమాలోనూ చిన్న పాత్రలో నటించారు. 2016 నుంచి రామ్ గోపాల్ వర్మతో ఏర్పడిన అనుబంధం ద్వారా సినిమా రంగంపై మరింత అవగాహన పెంచుకున్నారు. 2018 నుంచి యూట్యూబ్ జర్నీని సీరియస్‌గా తీసుకున్న ఆయన, ‘బ్యాక్ బెంచర్స్’ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటుడిగానే కాకుండా, గత ఏడాది సొంతంగా కంటెంట్ క్రియేషన్ కంపెనీని ప్రారంభించి వ్యాపారవేత్తగానూ రాణిస్తున్నారు.
నిద్ర లేచిన క్షణం నుంచి ఒక కంటెంట్ క్రియేటర్‌గా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఆలోచిస్తానని, కంటెంట్ క్రియేషన్ అనేది తన బిజినెస్ అయితే సినిమా అనేది తన ప్యాషన్ అని ఆయన స్పష్టం చేశారు. సాధారణ యువకుడిలా పార్టీలకు, ఎంజాయ్‌మెంట్‌కు దూరంగా ఉంటూ, తన వయసు కంటే ఐదేళ్లు పెద్దవాడిలా ఆలోచిస్తూ ప్రతి రోజూ కొత్తగా ఏదో ఒకటి క్రియేట్ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియా అనేది వైకుంఠపాళి లాంటిదని, ఇక్కడ ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొనే మానసిక స్థైర్యం ఉండాలని కొత్తవాళ్లకు సలహా ఇస్తున్నారు.
‘దందా’ సిరీస్‌లో అరవింద్ పాత్రకు వస్తున్న రెస్పాన్స్ తనకెంతో సంతృప్తినిచ్చిందని, దర్శకుడు ఆదిత్య దేవులపల్లి సపోర్ట్ వల్లే ఈ ఛాలెంజింగ్ పాత్రను సింగిల్ టేక్‌లో పూర్తి చేయగలిగానని తేజ వెల్లడించారు. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలనే ఉద్దేశంతోనూ, సెట్లో పూర్తిగా ఆ పాత్రలోనే లీనమైపోవాలనే సంకల్పంతోనూ తాను ఎక్కువ టేక్స్ తీసుకోలేదన్నారు. అలాగే నేటి కాలంలో కంటెంట్ ఎంత బాగున్నా సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోతే ఉపయోగం ఉండదని, ‘దందా’ ప్రమోషన్స్ కోసం తాము చేసిన వినూత్న ప్రయత్నాలే ఈ విజయానికి కారణమని పేర్కొన్నారు.
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల బాధ్యత చాలా ఎక్కువగా ఉంటుందని, సెలబ్రిటీల కంటే యూత్ ఇన్ఫ్లూయెన్సర్లను ఎక్కువగా అడ్మైర్ చేస్తారని, కాబట్టి వారు మాట్లాడే తీరు, వేసుకునే బట్టలు కూడా సమాజంపై ప్రభావం చూపుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో అందరూ సాధారణంగా రిలేట్ అయ్యే కథలు, జీరో టు హీరో పాత్రలు చేస్తూ, ప్రేక్షకులు తమ కోసం ఖర్చు పెట్టే ప్రతీ రూపాయికి న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తానని దొర సాయి తేజ స్పష్టం చేశారు.