Director | ఈ మధ్య సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషాద వార్తలు ఎక్కువగా వింటున్నాం. కొందరు ప్రముఖులు అనారోగ్యంతో కన్నుమూస్తుండడం అభిమానులని తీవ్ర ఆందోళనకి గురి చేస్తుంది. తాజాగా కోలీవుడ్ దర్శకుడు విక్రమ్ సుకుమారన్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించకుండానే కన్నుమూయడం బాధిస్తుంది. విక్రమ్ సుకుమారన్ తన కెరీర్ ప్రారంభంలో బాలు మహేంద్ర, వెట్రిమారన్ వంటి వారి వద్ద అసిస్టెంట్‌గా పని చేశారు. వెట్రిమారన్ తీసిన ఆడుకాలం సినిమాకి హార్డ్ వర్క్ చేశారు విక్రమ్. అతని వల్లే ఆడుకాలం చిత్రం హిట్ అయిందని వెట్రిమారన్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చిన విషయం విదితమే.
ఇక విక్రమ్.. శంతునుతో మద యానై కొట్టం, రావణ కొట్టం వంటి చిత్రాలు తీసి ఎంతగానో అలరించారు. ఇక సూరితో ఓ ప్రాజెక్ట్ అనుకోగా, అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఆ కల నెరవేరకుండానే ఇంత తొందరగా కన్నుమూయడంతో ఆయన సన్నిహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ తన సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తూ.. ఇంత త్వరగా వెళ్లిపోయావు.. ఆయన చెప్పాల్సిన కథలు ఎన్నో మరుగున పడినట్టే అని ట్వీట్ చేశాడు.
ఇక శంతను కూడా విక్రమ్‌కి నివాళులు అర్పిస్తూ.. త్వరగా వెళ్లిపోయావ్ మిత్రమా.. నీ నుండి నేను చాలా నేర్చుకున్నాను. నీతో గడిపిన ప్రతి క్షణం జీవితాంతం గుర్తుంటుంది. ఎందుకు ఇలా మా అందరిని వదిలి త్వరగా వెళ్లిపోయావ్. నిన్ను ఎంతో మిస్ అవుతాము. నీ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ శంతను ట్వీట్ వేశారు. ఆదివారం అర్దరాత్రి దాటిన తరువాత సోమవారం తెల్లవారుఝామున సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఆయన మధురై నుంచి చెన్నై వస్తున్న టైంలో బస్సులో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.