Guruprasad | భారతీయ సినిమా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్నది. కన్నడ నటుడు, దర్శకుడు గురు ప్రసాద్ (52) మృతి చెందారు. ఉత్తర బెంగళూరులోని దసనాపురలోని తన అపార్ట్మెంట్లో శవమై కనిపించారు. మదనాయకనహల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఆయన ఆత్యహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తున్నది. ఆర్థిక సమస్యలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గురు ప్రసాద్ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోందని అపార్ట్మెంట్ వాసులు పేర్కొన్నారు. దాంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫ్లాట్‌ను డోర్‌ను తెరిచారు. ఆయన సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు.
మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ (SOCO) బృందం పోలీసులు కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరిస్తుంది. ఆత్మహత్యకు ముందు ఏమైనా డెత్‌నోట్ రాసి ఉండవచ్చని.. ఈ క్రమంలో దాని కోసం పోలీసులు ఫ్లాట్‌లో శోధిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ఆదివారం ఉదయం 11 గంటలకు వెలుగులోకి వచ్చింది. టవర్ నెంబర్ 27 వద్ద నుంచి వస్తోందని భద్రతా సిబ్బంది అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్‌ను షేర్ చేశారు. చెత్త కారణంగా వాసన వస్తోందని అనుమానిస్తూ టవర్ వద్దకు వెళ్లారు. దుర్వాసన మరీ ఎక్కువ కావడంతో నిచ్చెన సహాయంతో ప్రసాద్ ఫ్లాట్ వద్ద పరిశీలించారు. కిటికీలోంచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ కనిపించారు. జయరామ్ అనే అపార్ట్మెంట్ వాసి మాట్లాడుతూ గురు ప్రసాద్‌ను తాను నాలుగు రోజుల కిందట చివరిసారిగా చూశానని తెలిపారు.
గురు ప్రసాద్ 2006లో సీనియర్ నటుడు జగ్గేశ్ నటించిన మఠం చిత్రంతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఎద్దేలు మంజునాథ, రంగనాయక సినిమాలకు దర్శకుడిగా పని చేశారు. ప్రసాద్ కర్ణాటక రాష్ట్ర ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. బాడీగార్డ్, కుష్క, విజిల్, హుడుగురు, మైలారీ, జిగర్తాండ సినిమాల్లో గురు ప్రసాద్ నటించారు. హుడుగారు, విజిల్, సూపర్ రంగా చిత్రాలకు డైలాగ్ రైటర్‌గానూ పని చేశారు. దివంగత సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హోస్ట్ చేసిన కన్నడ కోటియాధిపతి షోకి స్క్రిప్ట్, డైలాగ్స్ సైతం రాశారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.