F3 Movie Ticket Rates | హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతుంది అంటే ప్రేక్షకులలో ఆ చిత్రంపై తారా స్థాయిలో అంచనాలుంటాయి. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే అలా తెరకెక్కిన సీక్వెల్ సినిమాలు చాలా వరకు పరాజయాలనే సాధించాయి. ఈ క్రమంలో మొదటి భాగం కంటే సీక్వెల్ మరింత భారీ విజయం సాధిస్తుందని ‘ఎఫ్3’ బృందం గట్టి నమ్మకంతో ఉన్నారట. సంక్రాంతి కానుకగా 2019లో వచ్చిన ‘ఎఫ్2’ ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో తెలిసిందే. మూడేళ్ళ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కింది. వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్ర నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27న విడుదల కానుంది.
అయితే ఇటీవలే విడుదలైన స్టార్ హీరోల సినిమాలకు టిక్కెట్ రేట్లు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘ఎఫ్-3’ చిత్రానికి కూడా టిక్కెట్ రేట్లు పెరుగుతన్నాయా? అనే సందేహలు సినీప్రేక్షకులలో వ్యక్తం అవుతున్నాయి. తాజాగా దిల్ రాజు టిక్కెట్ రేట్లపై క్లారిటీ ఇచ్చాడు. ఎఫ్3 చిత్రానికి టిక్కెట్ రేట్లు పెంచడంలేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టిక్కెట్ రేట్లు ఉండబోతున్నట్లు వెల్లడించాడు. దీంతో సినీప్రేమికులకు కాస్త ఊరట కలిగినట్లు అయింది. ఇక ఎఫ్3 చిత్రానికి మల్టీప్లెక్స్‌లలో రూ.295 కాగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.175గా ఉండనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరిన్ కథానాయికలుగా నటించారు. సునీల్, సోనాల్ చౌహన్ కీలకపాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు.