‘నేను దర్శకత్వం వహించిన ‘అల్లరి ప్రియుడు’ చిత్రంలో రవితేజ డ్రమ్మర్‌గా చిన్న పాత్ర చేశాడు. అప్పుడే అతని ఎనర్జీ చూసి మాస్ మహారాజ్ అవుతాడని ఊహించా’ అని అన్నారు సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘ధమాకా’ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదలకానుంది. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. రైటర్ ప్రసన్నకుమార్ కామెడీ నాకు చాలా ఇష్టం. అతను అద్భుతమైన సంభాషణలు రాశాడు. పాత చిత్రాల్లో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కాంబినేషన్ తరహాలో ఈ సినిమాలో రావు రమేష్, ఆది కాంబో సరదాగా ఉంటుంది.
భీమ్స్ పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రమవుతుంది. ఈ సంస్థలో నేను సినిమాలు చేస్తూనే ఉంటా’ అన్నారు. ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో పైకొచ్చిన రవితేజ అందరికి స్ఫూర్తిగా నిలుస్తాడని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘నేను రవితేజ ఫ్యాన్. ఆయన ఏం చేస్తే థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో నాకు తెలుసు. డైలాగులు అదిరిపోతాయి. ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది’అని చెప్పారు. ఈ వేడుకలో దర్శకుడు మారుతి, సముద్రఖని, అభిషేక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.