Delhi Crime | వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొంది అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న పాపులర్ వెబ్‌సిరీస్‌లలో ‘దిల్లీ క్రైమ్’ (Delhi Crime) ఒకటి. ఇప్పటికే రెండు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ వెబ్ సిరీస్ తాజాగా మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 13 నుంచి తెలుగుతో పాటు హిందీ, తమిళం తదితర భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుండగా.. తాజాగా ట్రైలర్‌ను పంచుకుంది చిత్రబృందం.
ఫస్ట్ సీజన్ నిర్భయ అత్యాచారంపై రాగా.. సెకండ్ సీజన్ వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సాగే హత్యల దర్యాప్తు కథాంశంతో వచ్చింది. ఇక మూడో సీజన్ దేశంలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగ్ (మానవ అక్రమ రవాణా) చుట్టూ తిరగబోతున్నట్లు తెలుస్తుంది. హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడే ఒక కీలక మహిళా నేరస్థురాలిని డీసీపీ వర్తికా చతుర్వేది (షెఫాలీ షా) ఎలా పట్టుకున్నారు, ఈ దర్యాప్తులో ఆమె ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అనే కథాంశంతో ఈ సీజన్ రూపొందింది. ఈ సిరీస్‌లో షెఫాలీ షా (Shefali Shah) ప్రధాన పాత్రలో నటించగా, హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిచీ మెహతా (Richie Mehta) తనూజ్ చోప్రా (Tanuj Chopra) ఈ సిరీస్‌ను రూపొందించారు.