గత కొంతకాలంగా వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నది బాలీవుడ్ అగ్ర నాయిక దీపికా పడుకోన్. ప్రభాస్-సందీప్‌రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ నుంచి ఈ భామను తప్పించిన విషయం తెలిసిందే. దీపికా పడుకోన్ పెట్టిన అసంబద్ధమైన డిమాండ్లకు ఒప్పుకోలేక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఆమెను సినిమా నుంచి తప్పించారనే వార్తలు వినిపించాయి. ఇదిలావుండగా తెలుగు ఇండస్ట్రీలో ఈ భామకు మరో షాక్ తగిలింది.
ప్రభాస్ ‘కల్కి-2’ చిత్రంలో దీపికా పడుకోన్ నటించడం లేదని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘దీపికా పడుకోన్ ‘కల్కి-2’లో భాగం కాబోవడం లేదు. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. తొలిభాగం కోసం దీపికతో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేశాం. అయినా మా భాగస్వామ్యాన్ని కొనసాగించలేకపోతున్నాం. ‘కల్కి’ వంటి చిత్రాలకు అంకితభావంతో పాటు చాలా విషయాలు అవసరమవుతాయి.
ఆమె భవిష్యత్తు ప్రాజెక్ట్స్ అన్నీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం’ అంటూ వైజయంతీ మూవీస్ తన పోస్ట్‌లో పేర్కొంది. దీపికా పడుకోన్ వ్యవహార శైలి నచ్చకే ఆమెను సినిమా నుంచి తప్పించారని, నిర్మాణ సంస్థ ప్రకటనలో కూడా అదే విషయం అర్థమవుతున్నదని సోషల్‌మీడియాలో వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకున్న ‘కల్కి-2’ నుంచి దీపికా పడుకోన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఎవరు నటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.