‘కల్కి-2’ చిత్రంలో దీపికా పడుకోన్ నటించడం లేదని ఇటీవల నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడీ విషయం దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులతో పాటు ఫిల్మ్ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ‘స్పిరిట్’ ‘కల్కి-2’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల నుంచి దీపికా పడుకోన్‌ను తప్పించడంతో అమె అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు. పారితోషికం, పనిగంటల విషయంలో దీపికా పెట్టిన షరతులతో విసుగెత్తిన మేకర్స్ ఆమెను సినిమా నుంచి తప్పించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ నేపథ్యంలో దీపికా పడుకోన్ తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆమె పరోక్షంగా ‘కల్కి-2’ గురించి ప్రస్తావించారని నెటిజన్లు భావిస్తున్నారు.
షారుఖ్‌ఖాన్ నటిస్తున్న ‘కింగ్’ చిత్రంలో దీపికాను కథానాయికగా ఖరారు చేశారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఆరో చిత్రమిది కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే దీపికా పడుకోన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘18 ఏళ్ల క్రితం నా తొలి చిత్రం ‘ఓం శాంతి ఓం’లో నటిస్తున్నప్పుడే షారుఖ్‌ఖాన్ నాకు కొన్ని జీవిత పాఠాలు నేర్పించారు. ఒక సినిమా ద్వారా మనం ఏం నేర్చుకున్నాం. ఎవరితో పనిచేశాం అనే విషయాలు సినిమా విజయం కంటే ప్రాధాన్యమైన అంశాలని ఆయన చెప్పారు.
ఇప్పటికీ నా ప్రతి నిర్ణయం వెనక ఆ సూత్రాన్నే ఫాలో అవుతున్నా’ అని దీపికా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ‘కల్కి-2’ చిత్ర బృందాన్ని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘కల్కి-2’ నుంచి దీపికా నిష్క్రమణం తర్వాత దర్శకుడు నాగ్అశ్విన్ తన ఎక్స్ ఖాతాలో ‘కర్మను ఎవరూ తప్పించుకోలేరు. నీ కర్మను నువ్వు అనుభవించాల్సిందే’ అంటూ పోస్ట్ చేశారు. పరోక్షంగా దీపికాను టార్గెట్ చేస్తూ ఆయన ఈ పోస్ట్‌ను పెట్టారని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.