Danayya | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ భారీ అంచనాల నడుమ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే అద్భుతమైన హైప్ క్రియేట్ చేసుకున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, ప్రీమియర్స్‌తోనే ప్రభంజనం సృష్టించి, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో చిత్ర బృందం ఆనందంలో మునిగిపోయింది. విడుదల రోజునే రెండు షోలు పూర్తయ్యాక టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ, ‘ఓజీ’ టైటిల్ వెనకున్న ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు.
“ఈ ప్రాజెక్ట్ మొదలు కావడానికి అసలు కారణం త్రివిక్రమ్ గారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని అడిగినప్పుడు, డైరెక్టర్‌గా సుజిత్‌ని సూచించారు. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. అభిమానులు, ప్రేక్షకుల అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా, ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత పెట్టాలని ముందే నిర్ణయించుకున్నాం” అని చెప్పారు. దానయ్య మరో ముఖ్యమైన విషయాన్ని రివీల్ చేస్తూ..OG టైటిల్ అసలు నిర్మాత నాగ వంశీ దగ్గర ఉంది. ఆయనే రిజిస్టర్ చేసుకున్నారు. మేము అడిగిన వెంటనే ఆయన ఎలాంటి ఆలోచన లేకుండా మాకు ఇచ్చారు. ఈ టైటిల్ వల్లే సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. దానికి నాగ వంశీకి థ్యాంక్స్ చెప్పాలి అని తెలిపారు.
సుజీత్ ఈ సినిమా కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఆయన బేసిక్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్. థమన్ సంగీతం, నవీన్ నూలి ఎడిటింగ్, రవికే చంద్రన్ కెమెరా వర్క్ ఈ సినిమాకి బలమైన పిల్లర్స్. ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి అద్భుతంగా చేశారు. ఏఎస్ ప్రకాష్ సెట్ వర్క్ కూడా సినిమాకి స్పెషల్ అయింది అని దానయ్య పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ నటన చూసి నాకు పిచ్చెక్కిపోయింది. అభిమానుల ఆనందం తట్టుకోలేకపోతున్నాం. రిలీజ్ ముందు ఉన్న ఎగ్జైట్మెంట్, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డులుగా మారింది. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు ప్రేక్షకులకి ధన్యవాదాలు అని ఆనందం వ్యక్తం చేశారు. మొత్తానికి, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తూ , అభిమానుల్లో పండగ వాతావరణం తీసుకొచ్చింది.