Akshay Kumar | బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్‌కుమార్(Akshay Kumar), అర్షద్ వార్సీ(Arshad Warsi) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘జాలీ ఎల్ఎల్బీ 3’ (JollyLLB3). ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సినిమా న్యాయవాద వృత్తిని కించపరుస్తుందని పిటిషనర్ ఆరోపించగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు సినిమాలో అభ్యంతరకరమైన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది.
ఈ సినిమా ట్రైలర్‌తో పాటు ఇందులోని ‘భాయ్ వకీల్ హై’ అనే పాట.. న్యాయవాదుల గౌరవాన్ని తగ్గించేలా ఉందని ఆరోపిస్తూ.. అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయ్యింది, అయితే దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సంగీత చంద్ర, జస్టిస్ బ్రిజ్ రాజ్ సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషన్‌ని తోసిపుచ్చింది. సినిమాలోని కంటెంట్‌ను పరిశీలించిన తర్వాత ఈ సినిమాలోని ఏ అంశం కూడా న్యాయవాదుల గౌరవానికి భంగం కలిగించేలా లేదని.. ఇందులో కోర్టు జోక్యం అనవసరమని తెలిపింది.
అయితే అలహాబాద్ హైకోర్టులో చిత్రబృందానికి ఊరట లభించినప్పటికీ, పుణే సివిల్ కోర్టులో ఈ సినిమాపై మరొక కేసు విచారణలో ఉంది. ఈ సినిమా టీజర్లో న్యాయవాదులు, న్యాయమూర్తులను అమర్యాదగా చిత్రీకరించారని ఆరోపిస్తూ న్యాయవాదులు వాజెద్ ఖాన్ (బిడ్కర్) గణేష్ మస్కే పుణే సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సినిమా విషయానికి వస్తే.. కోర్టు రూమ్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం ‘జాలీ ఎల్ఎల్బీ’ సిరీస్‌లో రాబోతున్న మూడో చిత్రం. మొదటి చిత్రంలో జాలీగా అర్షద్ వార్సీ నటించి హిట్‌ని అందుకోగా.. రెండో పార్టులో అక్షయ్‌కుమార్ జాలీగా నటించి హిట్‌ని అందుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి జాలీ ఎల్ఎల్బీ 3లో రాబోతున్నారు. ఈ సినిమాకు సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా.. అలోక్ జైన్, అజిత్ అంధారే నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.