టాలీవుడ్లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూనే, తనదైన కామెడీ టైమింగ్‌తో ‘కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్’ అనిపించుకుంటున్న హీరో శ్రీవిష్ణు. ‘సామజవరగమన’, ‘స్వాగ్’ వంటి విభిన్న చిత్రాల తర్వాత ఆయన నటించిన తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకిరామ్ మారెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. మరి నేడు ప్రేక్షకులల ముందుకు వచ్చిన ఈ సినిమాతో శ్రీవిష్ణు ఈసారైనా బాక్సాఫీస్ వద్ద నవ్వుల వర్షం కురిపించాడా? అసలు కథేంటి? రివ్యూలో చూద్దాం.
కథ
90వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మాడుగుల అనే గ్రామం నక్సల్స్ ప్రభావంతో అట్టుడుకుతుంటుంది. ఆ ఊరిలో ఒక సినిమా థియేటర్‌ను లీజుకు తీసుకుని నడుపుతుంటాడు హీరో కళ్యాణ్ (శ్రీవిష్ణు). అదే ఊరికి కొత్తగా వచ్చిన ఒరియా యువతి సితార దేవి (మహిమ నంబియార్)తో కళ్యాణ్ ప్రేమలో పడతాడు. అయితే, ఆమె కేవలం అమ్మాయి మాత్రమే కాదని, ఒక పెద్ద సమస్యలో చిక్కుకుని ఆ ఊరికి వచ్చిందని తెలుస్తుంది. సితారను ఆ గండం నుంచి గట్టెక్కించడం కోసం కళ్యాణ్ అనూహ్యంగా నక్సలైట్ అవతారం ఎత్తాల్సి వస్తుంది. సింపుల్ అనుకున్న ఈ వ్యవహారం కాస్తా దారితప్పి, అతన్ని నేరుగా అడవుల్లోని నక్సల్స్ దళం మరియు పోలీసుల మధ్యలోకి నెట్టేస్తుంది. మరి సితార అసలు సమస్య ఏంటి? ఆమె కోసం నక్సలైట్‌గా మారిన కళ్యాణ్ ఆ ఉచ్చు నుంచి ఎలా బయటపడ్డాడు? మిగిలిన కథేంటి? అన్నదే తెరపై చూడాలి.
విశ్లేషణ
నక్సలిజం అనేది చాలా సీరియస్ మరియు సెన్సిటివ్ సబ్జెక్ట్. అయితే, ఈ చిత్రాన్ని పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్గా మలిచారు మేకర్స్. లాజిక్లను పూర్తిగా పక్కన పెట్టి కేవలం నవ్వుల కోసమే ఈ సినిమా చూస్తే మాత్రం మంచి టైమ్‌పాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. దర్శకుడు జానకిరామ్ మారెళ్ళ రాసుకున్న మూల కథ బాగుంది. హీరో అనుకోకుండా నక్సలైట్ వేషం వేసి, పోలీసులకు-నక్సల్స్‌కు మధ్య ఇరుక్కునే పాయింట్ మంచి వినోదాన్ని పంచుతుంది. ముఖ్యంగా భాను-నందు అందించిన సంభాషణలు, శ్రీవిష్ణు – సత్యల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌ను మరింత బలంగా, సీరియస్‌గా డీల్ చేసి ఉంటే సినిమా స్థాయి వేరేలా ఉండేది. అక్కడక్కడ స్క్రీన్ ప్లే కాస్త నెమ్మదించినా, కామెడీ డోస్ తగ్గకపోవడంతో ప్రేక్షకులు బోర్ ఫీలకకుండా ఎంజాయ్ చేయవచ్చు.
నటీనటుల ప్రతిభ
శ్రీవిష్ణు తనకి బాగా అచ్చొచ్చిన కామెడీ జానర్లో మరోసారి అదరగొట్టాడు. తన పాత్రలో ఎంతో ఈజీగా నటించి, ప్రతి సన్నివేశంలోనూ నవ్వులు పంచాడు. వన్ లైనర్స్ డైలాగ్స్‌తో పాటు తనపై తానే వేసుకునే సెటైర్లు బాగా పేలాయి. సత్య ఈ సినిమాకు సత్యనే అసలైన హైలైట్ అని చెప్పవచ్చు. శ్రీవిష్ణుతో కలిసి ఆయన చేసిన కామెడీ టైమింగ్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయిస్తుంది. ఇంగ్లీష్ లవ్ లెటర్ సీన్ మరియు అడవిలో పడే పాట్లు నవ్వు తెప్పిస్తాయి. మహిమ నంబియార్ చూడటానికి చాలా అందంగా కనిపించడమే కాకుండా, తన పరిధి మేరకు చక్కటి అభినయం ప్రదర్శించింది. వెన్నెల కిషోర్ కనిపించేది కొద్దిసేపే అయినా తనదైన మార్క్ కామెడీతో అలరిస్తాడు. సాయిచంద్, శత్రు, సుదర్శన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతికంగా
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి రిచ్ లుక్‌ని తెచ్చింది. పల్లెటూరు అందాలను, అడవి నేపథ్యంలో వచ్చే విజువల్స్‌ను చాలా సహజంగా కెమెరాలో బంధించారు. విజయ్ బుల్గానిన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం కామెడీ సన్నివేశాలను మరింత రంజింపజేసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు తగినట్లుగా ఖర్చు పెట్టారు.
చివరిగా లాజిక్‌లు వెతక్కుండా, కేవలం సరదాగా నవ్వుకోవడానికి వీకెండ్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కటి వినోదాత్మక చిత్రం కామ్రేడ్ కళ్యాణ్. శ్రీవిష్ణు, సత్యల కామెడీ కోసం ఈ సినిమాను ధైర్యంగా ఒకసారిచూసేయవచ్చు.
రేటింగ్: 3/5