చిరంజీవి ‘విశ్వంభర’ తెలుగుతెరపై ఇప్పటివరకూ రాని అడ్వెంచరస్ సోషియో ఫాంటసీ అద్భుతమని మేకర్స్ చెబుతున్నారు. అందమైన చందమామ కథలా అనిపించే ఈ ఫాంటసీ థ్రిల్లర్లో చిరంజీవి కారణజన్ముడైన భూలోకవీరుడిగా కనిపించనున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
దర్శకుడు వశిష్ఠ విజువల్ వండర్లా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు లోకాల మధ్య పోరాటం నేపథ్యంలో సాగుతుందని, దైవశక్తి, క్షుద్రశక్తి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తమని సమాచారం. ముఖ్యంగా పిల్లలకు నచ్చే అంశాలు ఈ కథలో చాలా ఉంటాయని తెలుస్తున్నది.
ఇందులో రెక్కల గుర్రంతో చిరంజీవి స్వారీ హైలైట్గా ఉంటుందట. మొత్తంగా ఈ సినిమా అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనుందని యూనిట్వర్గాలు చెబుతున్నాయి. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అషికా రంగనాథ్, సురభి పురాణిక్ తదితరులు ఇతర పాత్రధారులు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి, నిర్మాణం: యూవీ క్రియేషన్స్.