అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ ఏడాది వరుస సినిమాలతో అభిమానుల్లో జోష్ నింపబోతున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. ఇక బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి ఓ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని వీఎఫ్ఎక్స్ పనుల వల్ల జాప్యాన్ని ఎదుర్కొంటున్న ‘విశ్వంభర’ సినిమా రిలీజ్ గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులైంది. సంక్రాంతి బరిలో వస్తుందని అంచనా వేశారు. అయితే కథరీత్యా వీఎఫ్ఎక్స్కు చాలా ప్రాధాన్యత ఉండటంతో మేకర్స్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని తెలిసింది. అందుకు తగినట్లుగా మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని, ‘మన శంకర వరప్రసాద్ గారు’ రిలీజ్ తర్వాత చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.