Chiranjeevi | అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే, నాన్న ప్రేమలో మనకు బాధ్యత కనిపిస్తుంది. అందుకే చాలా మంది తమ తండ్రి మాకు రియల్ హీరో అని చెబుతుంటారు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా చాలా మంది ప్రముఖులు సైతం తమ తండ్రితో జ్ఞాపకాలు షేర్ చేసుకుంటూ ఫాదర్స్ డే విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ అందరి తండ్రులకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలు పద్దతిగా ఉండడానికి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి నాన్న ఎంతో తోడ్పాటుని అందిస్తారు. నా తండ్రే నా సూపర్ హీరో. తమ బలం, జ్ఞానం, ప్రేమతో జీవితాలని తీర్చిదిద్దే ప్రపంచంలోని అందమైన తండ్రులకి ఫాదర్స్ డే శుభాకాంక్షలు అని తన ఎక్స్‌లో రాసుకొచ్చారు చిరంజీవి.
ఇక చిరంజీవి తండ్రి వెంకట్రావు విషయానికి వస్తే ఆయన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల్లో కూడా నటించారు. చిరంజీవి సినిమాల్లోకి రాకముందే అంటే 1969లో విడుదలైన ‘జగత్ కిలాడీ’ సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసారు. ఆ తర్వాత ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చినప్పటికీ కుటుంబ బాధ్యతల రీత్యా ఉద్యోగానికే పరిమితం కావాల్సి వచ్చింది.నటనపై ఆయనకి ఆసక్తి ఉంది కాబట్టే పెద్ద కుమారుడైన శివశంకర వరప్రసాద్(చిరంజీవి)ని సినిమాల వైపు ప్రోత్సహించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదగడం చూసి వెంకట్రావు ఎంతగానో మురిసిపోయారు.
చిరంజీవి హీరోగా నటించిన ఓ సినిమాలో వెంకట్రావు కూడా నటించి కొడుకుతో కలిసి నటించాలన్న తన కోరిక కూడా తీర్చుకున్నారు. బాపు దర్శకత్వం వహించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’ సినిమాలో మంత్రి పాత్రకు సూటయ్యే నటుడి కోసం చాలామందిని స్క్రీన్ టెస్ట్ చేయగా, ఆ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అల్లు రామలింగయ్య .. బాపు దగ్గరికి వెళ్లి వెంకట్రావు పేరు సూచించారట. అందుకు బాపు ఓకే చెప్పేయడంతో ఆ సినిమాలో మంత్రి పాత్రలో వెంకట్రావు నటించారు. అందులో చిరంజీవి హీరోగా నటించారు.ఇద్దరు కలిసి సీన్స్ చేయకపోయిన ఒకే సినిమాలో నటించామన్న తృప్తి మాత్రం వెంకట్రావుకి మిగిలింది.