చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రం పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ సినిమాను ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఓ కాన్సెప్ట్ పోస్టర్ని కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్.. ప్రారంభానికి ముందే సినిమాపై అసక్తిని పెంచేసింది. మెగా అభిమానులంతా ప్రస్తుతం ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా అంటే శ్రీకాంత్ ఓదెల సినిమానే.
ఇప్పుడైతే ‘ది ప్యారడైజ్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు శ్రీకాంత్ ఓదెల. మరి మెగాస్టార్‌తో ఆయన సినిమా మొదలయ్యేది ఎప్పుడు? అని అంతా ఎదురుచూస్తున్న క్రమంలో సదరు చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి.. మెగాస్టార్, శ్రీకాంత్ ఓదెల సినిమాకు సంబంధించిన వార్తను మీడియాకు వెల్లడించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో మొదలుపెట్టనున్నట్టు ఆయన ప్రకటించారు. మెగా ఫ్యాన్స్‌కిది నిజంగా శుభవార్తే.