అగ్ర కథానాయకుడు చిరంజీవి తన 158వ చిత్రానికి ఇటీవలే శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె.నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ శనివారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. తొలి షెడ్యూల్లో చిరంజీవి, అనస్వర రాజన్‌లపై కీలక టాకీ పార్ట్‌ను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. కథలో ఇవి చాలా కీలకమైన సన్నివేశాలని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా వారు ఓ వీడియోను విడుదల చేశారు.
ఇందులో ప్రధాన సాంకేతిక బృందాన్ని పరిచయం చేశారు. వీడియోలో ఉత్సాహంగా కనిపించిన చిరంజీవి ‘లెట్స్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్..’ అంటూ సందడి చేశారు. అనంతరం దర్శకుడు బాబీని సినిమా టైటిల్ గురించి ఆయన అడిగారు. బాబీ దాటవేయగా, దానికి చిరంజీవి సరదాగా స్పందిస్తూ.. ‘సరైన సమయంలో నేనే టైటిల్ లీక్ చేస్తానేమో..’ అంటూ చమత్కరించారు.
వీరిద్దరి ఫన్నీ సంభాషణ వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి అత్యంత పవర్ఫుల్, ఇంటెన్స్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో కథానాయికతో పాటు ఇతర ప్రధాన తారాగణానికి చెందిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: తమన్.