Maha Shivaratri | సమయం.. సందర్భం ఉండాలని ఊరికే అనలేదు. ముఖ్యంగా సినిమా కోసం ఫిలిం మేకర్స్ దీన్ని పాటిస్తారు. పండగో, పర్వదినమో వచ్చిందంటే ఇక అప్డేట్ల సందడి మామూలుగా ఉండదు. ఇప్పుడు మార్చి 1న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజున తమ సినిమా అప్డేట్స్ ఇచ్చేందుకు టాలీవుడ్ ( Tollywood ) స్టార్స్ సిద్ధమైపోయారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ తమ ప్రాజెక్టుల అప్డేట్స్తో అభిమానులను, ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా భోళాశంకర్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. మార్చి 1న ఉదయం 9 గంటల 5 నిమిషాలకు ఈ సినిమా నుంచి చిరు ఫస్ట్ లుక్ రివీల్ కానుంది. ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ తెరకెక్కిస్తుండగా…తమన్నా నాయికగా నటిస్తున్నది. చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్ సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నది. గతంలో ప్రీ లుక్ ఒకటి విడుదల చేశారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ విడుదల కానుంది.
మాస్ హీరో రవితేజ కూడా మహాశివరాత్రి అప్ డేట్‌కు సిద్ధమవుతున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ సినిమా టీజర్ విడుదలను ఆ రోజు విడుదల చేయబోతున్నాడు. గతంలో ఈ సినిమా నుంచి ఫైట్ సీన్‌తో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు శివరాత్రి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తున్నది. దివ్యాంశ కౌశిక్ నాయికగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నది.