Chinmayi | మెగాస్టార్ చిరంజీవి ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. సినిమా ఇండస్ట్రీ అనేది అద్దంలాంటిదని, మనం ఎంత నిబద్ధతగా పనిచేస్తే అంతే ఫలితం తిరిగి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అవకాశాల కోసం తప్పుదారులు తొక్కాల్సిన అవసరం లేదని, కమిట్మెంట్తో పనిచేయడమే ముఖ్యమని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా భిన్నమైన కోణంలో స్పందించారు. ఇండస్ట్రీలో “కమిట్మెంట్” అనే పదానికి వాస్తవ పరిస్థితుల్లో వేరే అర్థాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళల విషయంలో అవకాశాలు రావాలంటే అనేక అవమానాలు, వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని చిన్మయి తన పోస్టులో పేర్కొన్నారు.
తాను చూసిన, విన్న సంఘటనలను ఉదాహరణగా చెప్పిన చిన్మయి… ఒక ఫిమేల్ మ్యూజిషియన్ స్టూడియోలో ఎదుర్కొన్న వేధింపులు ఆమెను ఆ రంగాన్ని వదిలే పరిస్థితికి నెట్టేశాయని తెలిపారు. అలాగే కొందరు పురుషులు మహిళలను లైంగికంగా ఇబ్బంది పెట్టడం, అటువంటి ప్రవర్తనకు సమాజంలోనే మౌన సమ్మతి లభిస్తున్నట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా ప్రస్తావించిన చిన్మయి, ప్రముఖ గీత రచయిత వైరాముత్తుతో సంబంధించి గతంలో చేసిన ఆరోపణలను మరోసారి గుర్తు చేశారు. ఇలాంటి ఘటనలు ఒక్కరివి కాదని, ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిన నిజాలేనని ఆమె వ్యాఖ్యానించారు. బాధితులకే తప్పు అంటగట్టే ధోరణి కూడా బాధాకరమని, సీనియర్లు కూడా కొన్నిసార్లు పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని చిన్మయి అన్నారు.
చిరంజీవి తరం వేరు, అప్పట్లో పరిస్థితులు వేరుగా ఉండేవని అంగీకరిస్తూనే… ప్రస్తుతం ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను అద్దం లాంటి మాటలతో కప్పిపుచ్చలేమని చిన్మయి స్పష్టం చేశారు. అవకాశాల పేరుతో లైంగిక ఆశలు పెట్టుకునే పురుషులే అసలు సమస్య అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారం మరోసారి సినిమా ఇండస్ట్రీలో మహిళల భద్రత, గౌరవంపై విస్తృత చర్చకు దారితీస్తోంది.