Cinema news | దర్శకుడు ఫాజిల్ ‘మణిచిత్రతాజు’ సినిమా ఏ ముహూర్తాన తీశాడోగానీ.. కన్నడలో ‘ఆప్తమిత్ర’గా, తమిళ్లో ‘చంద్రముఖి’గా, బెంగాలీలో ‘రాజ్‌మహల్’గా, హిందీలో ‘భూల్ భులయ్యా’గా రీమేక్ అవ్వడమే గాక, ప్రతి భాషలోనూ ఈ కథ విజయాలను అందుకుంది. ఇప్పుడు ఈ కథకు సీక్వెల్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పటికే తెలుగులో సీక్వెల్‌గా ‘నాగవల్లి’ సినిమా వచ్చింది. త్వరలో ‘చంద్రముఖి-2’ పేరుతో మరో సీక్వెల్ రానుంది.
పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాఘవ లారెన్స్ కథానాయకుడు. చంద్రముఖిగా టైటిల్‌రోల్‌ను కంగనారనౌత్ చేశారు. ఈ నెల 15న సినిమా విడుదల కానున్న సందర్భంగా కంగనా మీడియాతో మాట్లాడారు. ‘చంద్రముఖి’గా జ్యోతిక స్థాయి నటన మీ నుంచి ఆశించవచ్చా? అని అడగ్గా.. “నేను ఈ సినిమా ఒప్పుకోగానే జ్యోతిక ‘చంద్రముఖి’ చూశాను. చాలా గొప్పగా చేశారామె. ఈ సినిమాను ఆ చంద్రముఖితో పోల్చొద్దు. ఇది వేరే.. నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. కాన్ఫిడెంట్ చెబుతున్నాను. నిజమైన చంద్రముఖి మాదే” అని సమాధానమిచ్చారు కంగనా. ఆ సమాధానం విన్న కొంతమంది ‘అది కాన్ఫిడెంట్ కాదు. ఓవర్ కాన్ఫిడెంట్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.