Netflix | ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 1999 నాటి కాందహార్ హైజాక్ ఉదంతం నేపథ్యంలో తెరకెక్కించిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ వివాదాల్లో చిక్కుకుంది. ఇటీవల స్ట్రీమింగ్కు వచ్చిన ఈ సిరీస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. విజయ్‌వర్మ, నసీరుద్దీన్‌షా, అరవిందస్వామి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నేపాల్ రాజధాని ఖాట్మాండు నుంచి బయలుదేరిన భారతీయ విమానాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదులు హైజాక్ చేసి కాందహార్‌కు తరలించడం, అక్కడ ఉగ్రవాదుల చెరనుంచి ప్రయాణికులను విడిపించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యల నేపథ్యంలో ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు.
అయితే ఈ సిరీస్‌లో ఉగ్రవాదుల పేర్లను భోళాశంకర్, బర్గర్, డాక్టర్ అనే వివిధ పేర్లతో చూపించారు. దీనిపై సోషల్‌మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించేలా ఉద్దేశ్యపూర్వకంగా ఉగ్రవాదుల పేర్లను మార్చి చూపించారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరడంతో ప్రసార, మంత్రిత్వ శాఖ నెట్‌ఫ్లిక్స్‌కు సమన్లు జారీచేసింది.
అయితే పేర్లు మార్చడం వెనక దురుద్దేశ్యం ఏమీ లేదని, విస్త్రృత పరిశోధన తర్వాతే స్క్రిప్ట్‌ను రూపొందించామని, హైజాక్ ఆపరేషన్ సమయంలో భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు అనుమానం రాకుండా ఉగ్రవాదులు తమ సంభాషణల్లో పేర్లు మార్చుకొని పిలుచుకునేవారని దర్శకుడు అనుభవ్ సిన్హా ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వివరణ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎలా స్పందిస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.