Lenin | అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ విడుదలకు సిద్ధమవుతోంది. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా కాలంగా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా కీలకంగా మారింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ట్రైలర్ చూసిన తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
లెనిన్ ట్రైలర్ చాలా ఎంజాయ్ చేశాను. అఖిల్ తన పాత్రలో హృదయాన్ని, ఆవేశాన్ని అద్భుతంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్‌లో అతని నటన ఆకట్టుకుంది. జూలై 10న విడుదల కానున్న ఈ సినిమాతో మొత్తం చిత్ర బృందానికి భారీ విజయం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆయన పోస్టు చేశారు. మహేష్ బాబు చేసిన ఈ పోస్టుకు స్పందించిన అఖిల్.. “అన్నా.. మీ పోస్టు మా ముఖాల్లో పెద్ద చిరునవ్వు తీసుకొచ్చింది. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే” అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. నా ప్రియమైన సోదరుడు అఖిల్ అదరగొట్టాడు అంటూ ఆయన అభినందించారు.
అలాగే హీరో నాని కూడా ట్రైలర్‌పై స్పందిస్తూ, లెనిన్తో అఖిల్ పెద్ద విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌లో అతని కష్టపడిన తీరు కనిపిస్తోంది. ఈ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది అని పేర్కొన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ కూడా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. లెనిన్ ట్రైలర్ బ్లాస్ట్ అయింది. అఖిల్.. ఇది నీ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రంగా నిలిచేలా కనిపిస్తోంది. ఈ పాత్ర కోసమే నువ్వు పుట్టినట్టుంది. నీలో కనిపించిన ఫైర్, కమిట్మెంట్ అద్భుతంగా ఉన్నాయి. సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చిత్రబృందానికి శుభాకాంక్షలు అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ పోస్టులకు కూడా అఖిల్ స్పందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘లెనిన్’ రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్, ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. జూలై 10న విడుదల కానున్న ఈ సినిమాతో అఖిల్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.