సోషల్‌మీడియా పోస్ట్‌లకు సెలబ్రిటీలు కొట్టే లైక్‌లు కూడా వారికి చిక్కులు తెచ్చిపెడుతున్న ఉదంతాలు ఇటీవల ఎక్కువవుతున్నాయి. వర్ధమాన బాలీవుడ్ నటి అన్వీత్కౌర్ వీడియోకు భారత స్టార్ బ్యాటర్ విరాట్‌కోహ్లి లైక్ కొట్టడం సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నాయిక జాన్వీకపూర్ ఓ పోస్ట్‌కు కొట్టిన లైక్ ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ అగ్ర కథానాయికలు శ్రీదేవి, మాధురిదీక్షిత్లు నటించిన ‘బేటా’ ‘ఖుదా గవా’ చిత్రాలు 1992లో విడుదలయ్యాయి. ‘బేటా’ చిత్రానికి మాధురిదీక్షిత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు దక్కించుకుంది. ‘ఖుదా గవా’లో శ్రీదేవి డ్యూయల్ రోల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరచినప్పటికీ ఆమెకు ఎలాంటి అవార్డు రాలేదు. ఇదే విషయంపై ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ రీల్‌ను రూపొందించాడు.
రెండు సినిమాలకు సంబంధించిన వీడియోను పొందుపరచిన అతను…‘బేటా’ సినిమాలో మాధురి దీక్షిత్ చేసిన ‘ధక్ ధక్ కర్నే లగా..’ పాటను ఉదహరిస్తూ ‘ఇలాంటి వల్గర్ డ్యాన్స్ చేసినందుకేనా మాధురీకి ఫిల్మ్ ఫేర్ దక్కింది’ అని ప్రశ్నించాడు. ‘ఖుదా గవా’ చిత్రాన్ని శ్రీదేవి తన భుజస్కంధాలపై మోసిందని, అయినా ఆమె ప్రతిభను గుర్తించలేదని వాపోయాడు. ఈ రీల్‌కు జాన్వీకపూర్ లైక్ కొట్టడంతో అది కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అమ్మపై ప్రేమ ఉండటం సహజమే కానీ.. మాధురిదీక్షిత్ వంటి సీనియర్ నటిపై అయిష్టం ఎందుకంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీంతో వెంటనే ఆ లైక్‌ను తీసివేసింది జాన్వీకపూర్.