Toxic | టాక్సిక్ ప్రీరిలీజ్ ఈవెంట్లో జరిగిన తొక్కిసలాట, ఫ్లడ్ లైట్ స్తంభం కూలిన ఘటనపై మల్లారెడ్డి యూనివర్సిటీపై, టాక్సిక్ చిత్ర యూనిట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న యశ్ తాజా చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ వేడుకలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి పరిధిలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు, అభిమానులు తరలివచ్చారు.
అయితే హీరో యశ్‌ను దగ్గరగా చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో స్వల్ప తొక్కిసలాట జరిగి పలువురు గాయపడినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హీరో యశ్‌తో పాటు ఎమ్మెల్యే మల్లారెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యశ్ వేదికపై మాట్లాడుతూ ఉండగా అభిమానులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అరుపులు, కేకలతో సందడి చేశారు. తమ అభిమాన హీరోను మరింత దగ్గరగా చూసేందుకు కొందరు ఒక్కసారిగా వేదిక వైపు చొచ్చుకువచ్చేం దుకు ప్రయత్నించడంతో అక్కడ జనసందోహం పెరిగింది.