‘మద్యపాన వ్యసనం వల్ల తలెత్తే పరిణామాల్ని ఆవిష్కరిస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఎలాంటి సందేశాలు లేకుండా ఆద్యంతం వినోదభరితంగా ఉంటుంది’ అని అన్నారు శివుడు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బ్రాందీ డైరీస్’. గరుడశేఖర్, సునీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ నిర్మాత. ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం శివుడు పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘వెండితెరపై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని సరికొత్త కథతో ఈ సినిమా చేశాం. కథ మొత్తం ఆల్కహాల్ చుట్టూ తిరుగుతుంది. ప్రాచీనకాలం నుంచి ఉన్న మద్యపాన సంస్కృతిని నేటి సమాజంలో చాలా మంది ఎందుకు ద్వేషిస్తున్నారు? ఆల్కహాల్ మంచిదా?చెడ్డదా?అనే అంశాలతో రెండు గంటలు నవ్విస్తూనే ఉంటుంది. కుటుంబ విలువలకు ప్రాధాన్యముంటుంది. తాగుబోతులను కించపరిచేలా ఈ సినిమా ఉండదు. నూతన తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించాం’ అని తెలిపారు.