Dhurandhar 2 | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో గూఢచారిగా నటించిన ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద అప్రతిహత విజయాన్ని నమోదు చేస్తోంది. సాధారణంగా వీకెండ్ తర్వాత సోమవారం వసూళ్లు గణనీయంగా తగ్గడం సహజమే అయినప్పటికీ, ఈ చిత్రం మాత్రం ఆ ట్రెండ్‌ను తిరగరాసి తన దూకుడును కొనసాగిస్తోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 829.76 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇండియాలో మాత్రమే రూ. 519.12 కోట్ల నెట్ (గ్రాస్ రూ. 619.76 కోట్లు) వసూళ్లు రాబట్టడం ఈ సినిమా ప్రభంజనానికి నిదర్శనం. మొదటి సోమవారం అయిన ఐదో రోజు, ఈ చిత్రం ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది.
ఆదివారం నమోదైన రూ. 114.85 కోట్లతో పోలిస్తే 43.4 శాతం తగ్గుదల కనిపించినప్పటికీ, వర్కింగ్ డేలో ఈ స్థాయి వసూళ్లు రావడం విశేషంగా భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 20,000కు పైగా షోల ద్వారా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడం మరో ప్రత్యేకత. వీకెండ్ గణాంకాలు చూస్తే.. శనివారం (3వ రోజు): రూ. 135.15 కోట్ల గ్రాస్ (ఆక్యుపెన్సీ 81.6%) కాగా, ఆదివారం (4వ రోజు): రూ. 137.43 కోట్ల గ్రాస్ (ఆక్యుపెన్సీ 79.7%), సోమవారం (5వ రోజు): రూ. 77.79 కోట్ల గ్రాస్ (ఆక్యుపెన్సీ 43.1%) సాధించింది. ఈ గణాంకాలు చూస్తే, సినిమా మొదటి వారంలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందినట్టు స్పష్టమవుతోంది.
దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ ‘ధురంధర్ 2’ ప్రభంజనం కొనసాగుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటికే రూ. 210 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 829.76 కోట్లకు చేరుకోవడం, ఈ సినిమాను గ్లోబల్ హిట్‌గా నిలబెడుతోంది. ఈ దూకుడుతో, షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’, ‘జవాన్’, యశ్ నటించిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, అలాగే ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి పాన్-ఇండియా బ్లాక్బస్టర్ల ఓపెనింగ్ రికార్డులను ఈ చిత్రం అధిగమించడం గమనార్హం. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, కరాచీలోని నేర సామ్రాజ్యం మరియు రాజకీయ వ్యవస్థలోకి చొరబడే భారతీయ గూఢచారి ఆపరేషన్స్ చుట్టూ తిరుగుతుంది. ముఖ్యంగా 2008 ముంబై అటాక్స్ తర్వాత జరిగిన పరిణామాలను కథలో ప్రతిబింబిస్తూ, దేశ భద్రత కోసం హీరో చేసే పోరాటాన్ని రసవత్తరంగా చూపించారు.