Actor Mukul Dev | ప్రముఖ బాలీవుడ్ నటుడు, మాజీ మోడల్ ముకుల్ దేవ్ 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ముకుల్ దేవ్ మరణవార్తను ఆయన సన్నిహితురాలు, నటి దీప్శిఖా నాగ్‌పాల్ సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ముకుల్ దేవ్ మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, కొంతకాలంగా ఆయన ఆరోగ్యం సరిగా లేదని సమాచారం.
‘సన్ ఆఫ్ సర్దార్’, ‘ఆర్… రాజ్ కుమార్’, ‘జై హో’ వంటి పలు హిందీ చిత్రాలలో ముకుల్ దేవ్ నటించి మంచి గుర్తింపు పొందారు. హిందీతో పాటు తెలుగు, పంజాబీ చిత్రాలలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. తెలుగులో ప్రభాస్ నటించిన ఎక్ నిరంజన్ సినిమాతో పాటు రవితేజ నటించిన కృష్ణ సినిమాలో కీలక పాత్రల్లో మెరిశాడు ముకుల్. చివరిగా ‘అంత్ ది ఎండ్’ అనే హిందీ చిత్రంలో కనిపించిన ముకుల్ దేవ్, బాలీవుడ్ నటుడు రాహుల్ దేవ్‌కి సోదరుడు.
పంజాబీ కుటుంబంలో న్యూఢిల్లీలో జన్మించాడు ముకుల్ దేవ్. తన ఎనిమిదవ తరగతిలోనే దూరదర్శన్ నిర్వహించిన డ్యాన్స్ షోలో మైఖేల్ జాక్సన్‌గా నటించి తన మొదటి పారితోషికాన్ని అందుకున్నారు ముకుల్ దేవ్. నటనతో పాటు, ఆయనకు మరో అరుదైన ప్రతిభ కూడా ఉంది. ముకుల్ దేవ్ ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ నుండి శిక్షణ పొందిన పైలట్ కావడం గమనార్హం.
ముకుల్ సినీ ప్రస్థానం 1996లో ‘ముమ్కిన్’ అనే టెలివిజన్ ధారావాహికతో ప్రారంభమైంది, ఇందులో ఆయన విజయ్ పాండే పాత్రను పోషించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ప్రసిద్ధ కామెడీ బాలీవుడ్ కౌంట్‌డౌన్ షో ‘ఏక్ సే బద్ కర్ ఏక్’లో కూడా ఆయన నటించారు. టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసిన ముకుల్ దేవ్, ‘ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా’ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. సినిమాల విషయానికి వస్తే, ఆయన ప్రస్థానం ‘దస్తక్’ చిత్రంతో మొదలైంది. ఈ చిత్రంలో ఆయన ACP రోహిత్ మల్హోత్రా పాత్రలో నటించారు. అంతేకాకుండా, ఈ చిత్రం మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ అరంగేట్రానికి వేదికైంది.