పాపులర్ తెలుగు టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ -6 సందడి మొదలైంది. అక్కినేని నాగార్జున (Akkineni nagarjuna) హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 (Bigg Boss Telugu 6) ఇవాళ సాయంత్రం గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ప్రతీ ఏడాదిలాగే ఈ సారి కూడా పలువురు టీవీ, సినీ సెలబ్రిటీలు ఈ షోలో సందడి చేయబోతున్నారు. నాగార్జున ఒక్కొక్కరికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఘనస్వాగతం పలికాడు.
ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేయబోతున్న కంటెస్టెంట్స్..వారి నేపథ్యాలు వివరాల్లోకి వెళ్తే..
మొదటి కంటెస్టెంట్: కీర్తికేశవ్
బిగ్ బాస్ తొలి కంటెస్టెంట్‌గా టీవీ నటి కీర్తి కేశవ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ ఎంట్రీతో ‘గాంధారీ’ ప్రైవేట్ సాంగ్‌కు డ్యాన్స్ చేయగా..నాగార్జున ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాడు. కీర్తి కేశవ్ తెలుగు ప్రేక్షకులకు భానుగా సుపరిచితురాలు. ఈ బెంగళూరు చిన్నది మనసిచ్చి చూడు సీరియల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టంతో నటనలో శిక్షణ తీసుకుంది. పాపులర్ టీవీ సీరియస్ కార్తీక దీపంలో హిమ రోల్లో నటిస్తోంది కీర్తికేశవ్.
రెండో కంటెస్టెంట్ : పింకీ
పింకీ అలియాస్ సుదీప రెండో కంటెస్టంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిన్నది వెంకటేశ్, ఆర్తిఅగర్వాల్ కాంబోలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రతో పాపులర్ అయిపోయింది. 1994లో రవిరాజా పినిశెట్టి డైరెక్షన్లో వచ్చిన ధర్మరాజు ఎంఏ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత మోహన్ బాబు హీరోగా నటించిన అల్లుడుగారు, సిద్ధార్థ్ నటించిన బొమ్మరిల్లు, చిరంజీవి నటించిన స్టాలిన్ తోపాటు పలు చిత్రాల్లో నటించింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ శ్రీరంగనాథ్ను పెళ్లాడిని తర్వాత సినిమాలకు దూరమైంది. ఇక బిగ్ బాస్ షోతో ఎలా అట్రాక్ట్ చేస్తుందోనని ఎక్జయిటింగ్‌గా చూస్తున్నారు ప్రేక్షకులు.
మూడో కంటెస్టెంట్: శ్రీహాన్
సిరి హన్మంత్ బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ మూడో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాడు. బిగ్‌బాస్ ఓటీటీ మొదటి సీజన్లోనే శ్రీహాన్ కంటెస్టెంట్‌గా రాబోతున్నాడంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. అప్పుడు మిస్సయినా..బిగ్ బాస్ సీజన్ 6తో అవకాశం అందుకుని హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీహాన్ ప్రేక్షకుల దగ్గర ఎలాంటి మార్కులు కొట్టేస్తాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బిగ్ బాస్ లవర్స్.
నాలుగో కంటెస్టెంట్: నేహా చౌదరి
యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టిన నేహా చౌదరి క్రీడానేపథ్యం నుంచి వచ్చింది. నేహా రిథమిక్ జిమ్నాస్టిక్స్ విభాగంగా నేషనల్ చాంపియన్ గెలిచింది. తెలుగమ్మాయి అయిన నేహా చౌదరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ (ఐపీఎల్)లో యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాంకర్ కమ్ స్పోర్ట్స్ పర్సన్ అయిన నేహా చౌదరి బిగ్ బాస్ సీజన్ 6తో ఆడియెన్స్ ను ఎలా మెప్పించనుందో చూడాలి.
ఐదో కంటెస్టెంట్: చలాకీ చంటీ
జబర్దస్త్ కామెడీ షోతో చలాకీ చంటీగా మంచి పాపులారిటీ సంపాదించాడు. నాని నటించిన భీమిలీ కబడ్డీ జట్టుతోపాటు పలు సినిమాల్లో నటించినప్పటికీ టీవీ షోలలో తన కామెడీ టైమింగ్‌తో పాపులర్ అయ్యాడు చంటీ. 2016లో పెళ్లి చేసుకున్నాడు చంటీ. టీవీ షోలు, సినిమాలతో అలరించిన చలాకీ చంటీ ఇపుడు బిగ్ బాస్ షోలో ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి.
ఆరవ కంటెస్టెంట్: శ్రీసత్య
నటి శ్రీసత్య అసలు పేరు మంగళంపల్లి శ్రీసత్య. మిస్ విజయవాడ-2015 విన్నర్‌గా నిలిచింది శ్రీసత్య. నేను శైలజ సినిమాలో హీరో రామ్ స్నేహితురాలి రోల్లో కనిపించింది. ఆ తర్వాత ముద్దమందారం, నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. మరి శ్రీ సత్య ఎలా బిగ్ బాస్ షోలో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఏదో కంటెస్టెంట్: అర్జున్ కల్యాన్
షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అర్జున్ కల్యాణ్..2013లో ‘చిన్న సినిమా ‘తో సిల్వర్ స్క్రీన్కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ప్లేబ్యాక్, పెళ్లి కూతురి పార్టీ సినిమాలు చేశాడు. దీంతోపాటు వరుడు కావలెను, ఉప్మా తినేసింది, మిస్సమ్మ వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ షోతో ఎలా మెప్పిస్తాడనేది చూడాలి.
ఎనిమిదో కంటెస్టెంట్: గీతాగోయల్
సోషల్ మీడియాను యాక్టివ్‌గా ఉండేవారికి గీతూరాయల్ గుర్తుంటుంది. తనదైన యాసతో బిగ్‌బాస్ రివ్యూలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. యూట్యూబర్‌గా, టిక్ టాక్ స్టార్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ షోలో పుష్ప స్కిట్‌తో పాపులారిటీ సంపాదించుకున్న గీతాగోయల్ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా అలరిస్తుందో చూడాలంటున్నారు ఆడియెన్స్.
తొమ్మిదో కంటెస్టెంట్: అభినయశ్రీ
చెన్నైకి చెందిన అభినయశ్రీ నటి మాత్రమే కాదు..కొరియోగ్రఫర్ కూడా. తెలుగులో స్నేహంటే ఇదేనా, శ్వేతనాగు, జై,ఆప్తుడు, హంగామా, ఎవరి గోల వాడిదే చిత్రాల్లో నటించింది. ఆర్య సినిమాలో స్పెషల్ సాంగ్‌లో మెరిసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తెలుగులో చివరగా పాండవులు సినిమాలో మెరిసిన అభినయశ్రీ మళ్లీ చాలా కాలం తర్వాత బిగ్ బాస్ సీజన్ 6తో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతుంది. ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.
పది, పదకొండవ కంటెస్టెంట్స్: మెరీనా, రోహిత్
మెరీనా పూర్తిపేరు మెరీనా అబ్రహాం. ఈ బ్యూటీ అమెరికా అమ్మాయి, ఉయ్యాల జంపాల సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవీ-2017 అవార్డు గెలుచుకుంది మెరీనా.
ఇక రోహిత్ మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి..నీలి కలువలు,అభిలాష, కంటే కూతుర్నే కనాలి సీరియల్స్ తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డ రోహిత్-మెరీనా 2017లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్ బాస్ సీజన్-3లో మెరిసిన సెలబ్రిటీ కపుల్ వరుణ్ సందేశ్-వితికా షేరులను ఈ ఇద్దరి మరిపిస్తారో..? లేదో ..? తెలుసుకునేందుకు ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
పన్నెండో కంటెస్టెంట్: బాలాదిత్య
బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన బాలాదిత్య తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. జంబలకిడి పంబ, హిట్లర్, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, సమర సింహారెడ్డి, లిటిల్ సోల్జర్స్, సంకల్పంతోపాటు పలు చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించాడు. చంటిగాడు సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. లిటిల్ సోల్జర్స్ సినిమా నంది అవార్డు కూడా అందుకున్నాడు. 2006లో లక్ష్మీమానసతో వివాహం కాగా..వీరికి ఒక కుమార్తె. టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో కూడా మెరిసిన బాలాదిత్య బిగ్ బాస్ హౌస్‌లో ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి.
పదమూడో కంటెస్టెంట్: వాసంతీ కృష్ణన్
మోడల్‌గా కెరీర్ షురూ చేసిన వాంతీ కృష్ణన్ సిరిసిరి మువ్వలు సీరియల్‌తో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. సంపూర్ణేశ్ బాబుతో కలిసి కాలీఫ్లవర్ సినిమాలో మెరిసింది. రీసెంట్ గా కే రాఘవేంద్రరావు సమర్ఫణలో వచ్చిన వాంటెడ్ పండుగాడ్ సినిమాలో కూడా నటించింది. మరి కన్నడ నుంచి తెలుగు నాట సందడి చేస్తున్న వాసంతీ బిగ్ బాస్‌ను ఏ మేర మెప్పిస్తోందో చూడాలి.
పద్నాలుగో కంటెస్టెంట్: షానీ సాల్మన్
బ్లాక్ స్టార్‌గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యాక్టర్ షానీ సాల్మన్. 2003లో వచ్చిన సై సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అథ్లెటిక్‌గా నేషనల్ ఛాంపియన్ షిప్ అందుకున్న షానీ..ఘర్షణ, దేవదాస్, హ్యాపీ, రెడీ, ఒక్కమగాడు, శశిరేఖా పరిణయం, కిన్నెరసానితోపాటు పలు చిత్రాల్లో నటించారు. ఈ క్రేజీ యాక్టర్ మరి బిగ్‌బాస్ సీజన్-6తో ఎంతవరకు మెప్పిస్తాడనేది చూడాలి
పదిహేనవ కంటెస్టెంట్: ఇనయా సుల్తానా
రామ్‌గోపాల్ వర్మతో కలిసి డ్యాన్స్ చేసి ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించింది నటి ఇనయా సుల్తానా. ‘బుజ్జీ ఇలారా’,‘అవ్యోం జగత్’ తోపాటు పలు చిత్రాల్లో నటించిన ఇనయా సుల్తానాకు అంత గుర్తింపు రాలేదు. ఆర్జీవో సపోర్టుగో పాపులర్ అయిన ఈ భామ బిగ్ బాస్ షోతో ఎలా మెప్పిస్తుందో చూడాలంటున్నారు ప్రేక్షకులు.
పదహారవ కంటెస్టెంట్: ఆర్జే సూర్య
ఆర్జే సూర్యగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుంకర సత్యనారాయణ అలియాస్ కొండబాబు. మిమిక్రీ ఆర్టిస్టుగా చాలా షోలు వేశాడు. ఆ తర్వాత గరుడ వేగ, గుంటూరు టాకీస్ సినిమాల్లో నటించారు. యాక్టర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, యాంకర్‌గా కొనసాగుతున్నాడు. చాలా మంది హీరోల వాయిస్‌ను అచ్చు అలానే ఇమిటేట్ చేయడం ఇతడి ప్రత్యేకత. మరి బిగ్ బాస్ హౌస్‌లో ఎలా అలరిస్తాడో చూడాలి.
పదిహేడో కంటెస్టెంట్..
బిగ్ బాస్ రివ్యూలతో పాపులారిటీ సంపాదించుకున్నాడు ఆదిరెడ్డి. బిగ్ బాస్ సీజన్-2పై రివ్యూ ఇస్తూ షేర్ చేసిన వీడియోతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి బిగ్ బాస్ షోలపై రివ్యూలు ఇస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆదిరెడ్డి కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ యూట్యూబర్ ఎలా మెప్పిస్తాడనేది చూడాలి.
18వ కంటెస్టెంట్: రాజశేఖర్
మోడలింగ్ నుంచి వచ్చిన రాజశేఖర్ మనసు మమత సీరియల్లో నటించాడు. మేజర్ సినిమాలో కూడా నటించిన రాజశేఖర్ బిగ్ బాస్ హౌస్‌లో ఎలా ఎంటర్టైన్ చేస్తాడో చూడాలి.
19వ కంటెస్టెంట్: అరోహి రావ్
అరోహి రావ్ అలియాస్ అంజలి యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇస్మార్ట్ న్యూస్‌తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ వరంగల్ చిన్నది బిగ్ బాస్ గేమ్ షోలో ఎలా ఆడి మెప్పిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.
20వ కంటెస్టెంట్: సింగర్ రేవంత్
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన రేవంత్ టాలెంటెడ్ సింగర్‌గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేతగా నిలిచాడు. బాహుబలి..ది బిగినింగ్‌లో రేవంత్ పాడిన మనోహరి పాట మంచి పాపులర్ అయింది. తెలుగు, కన్నడ భాషల్లో 200కు పైగా పాటలు పాడిన రేవంత్ మరి బిగ్ బాస్ షోతో ఎలా అందరినీ మెప్పిస్తాడనేది చూడాలి.