మంచిమాటకు మనిషిని, మనసును మార్చే శక్తి ఉంటుంది. అయితే, ఆ మాటలే అనర్థాలకూ కారణమవుతాయి. ఏది ఏమైనా మాటే నా బలం అంటున్నది స్టార్ మా ‘బిగ్‌బాస్-6’ ఫేమ్ గ్రీష్మ గీతిక లేఖ రాయలు అలియాస్ గీతూ రాయల్. బిగ్‌బాస్ టైటిల్ రేసులో వెనకబడినా.. ‘స్టార్ మా పరివారం’ కార్యక్రమంతో ప్రేక్షకులను అలరించనున్న గీతూ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే..
నాకు చిన్నప్పటినుంచీ రూలర్‌గా ఉండటం ఇష్టం. అందుకే ఒక మంచి రాజకీయ నాయకురాలిగా ఎదగాలను కుంటున్నా. రాజకీయం అంటే చెడుకు పర్యాయపదంగా మారిపోయింది. రాజకీయ నాయకులూ సేవ చేస్తారని నిరూపిస్తా. నా తల్లిదండ్రులు, తమ్ముడు, భర్త వికాస్ ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నా.
ఆడపిల్లలు ధైర్యంగా, స్వతంత్రంగా ఉండాలి అని చాలామంది చెబుతారు. కానీ, అలా ఉండే నాలాంటి వాళ్లను చూసి ‘అమ్మాయిలు ఇలాగేనా ఉండేది!’ అని విమర్శిస్తారు. ఎవరు ఏమనుకున్నా నేనెప్పుడూ ఒకేలా ఉంటా! బిగ్‌బాస్ హౌస్‌లోనూ అలాగే ఉన్నా. కానీ, నేను కావాలనే అలా మాట్లాడుతున్నానని చాలామంది అనుకున్నారు. నేను ఇంట్లో ఎలా ఉంటానో.. బిగ్‌బాస్‌లోనూ అలాగే ఉన్నాను. యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అయ్యేవారికి ఆ సంగతి అర్థమవుతుంది.
అమెజాన్‌లో కొలువు
నేను చిత్తూరులో పుట్టాను. మా నాన్న విజయ డెయిరీలో మంచి హోదాలో పనిచేసేవారు. ఆ సంస్థను మూసేసిన తర్వాత ఉన్న డబ్బంతా షేర్స్‌లో పెట్టారు. కొన్నాళ్లకు అంతా పోయింది. అది ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ! మా అమ్మ బాగా చదువుకుంది. కూచిపూడి నర్తకి కూడా. నంద్యాలలో కేశవరెడ్డి స్కూల్స్ బ్రాంచ్ ప్రారంభిస్తున్నారని తెలిసి టీచర్‌గా పనిచేయడానికి వెళ్లింది. అలా నా చిన్నప్పుడే మా కుటుంబం నంద్యాలకు షిఫ్ట్ అయింది. మొదట్లో అమ్మ డ్యాన్స్, సైన్స్ టీచర్‌గా పనిచేసింది. కొన్నాళ్లకు ప్రిన్సిపల్ అయింది. నేను చదువులో ఎప్పుడూ ముందుండేదాన్ని. బెంగళూరు ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతుండగానే అమెజాన్‌లో ఉద్యోగం వచ్చింది. అక్కడ నా ప్రతిభను నిరూపించుకున్నా!
టిక్‌టాక్‌తో..
నలుగురితో మాట్లాడటం, నలుగురినీ కలవడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ, 2020లో లాక్డౌన్లో ఇంట్లో ఉండటంతో చాలా బోర్ కొట్టింది. అప్పుడే టిక్‌టాక్‌లో వీడియోలు చేయడం మొదలుపెట్టా. డబ్స్మాష్, మోటివేషనల్ టాక్స్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఒక్కవారంలోనే సబ్‌స్ర్కైబర్స్ సంఖ్య అయిదు లక్షలకు చేరింది. టిక్‌టాక్ బ్యాన్ కావడంతో ఇన్‌స్టా వేదికగా అభిమానులను పలకరించా. అప్పుడే ఓ యూట్యూబ్ చానల్ బిగ్‌బాస్-3 రివ్యూలు చేయమని అడిగింది. నేను చేసిన రివ్యూలు బాగా పాపులర్ అయ్యాయి. కొన్ని షోలు, సినిమాల్లోనూ అవకాశం వచ్చింది. కానీ, ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. అందరూ అమ్మానాన్నలను నా గురించి అడుగుతుండటం, మెచ్చుకోవడంతో ‘జబర్దస్త్’ చేసేందుకు ఒప్పుకొన్నారు. ‘పుష్ప’ థీమ్‌తో చేసిన స్కిట్ తెగ వైరల్ అయ్యింది.
తెలిసీ ఓడిపోయా..
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు ఎలా ఉన్నారు? ఎలా ఉంటే గెలుస్తారు? ఎలా ఉండాలి? అనేది ఒక రివ్యూయర్‌గా మూడు సీజన్స్ చూశాను. కానీ అలానే ఉంటే నా రియాలిటీ దెబ్బతింటుంది అనిపించింది. అందుకే నేను నాలానే ఉన్నాను. ఆడపిల్ల రెబలిస్టిక్గా ఉండటం ప్రేక్షకులకు నచ్చనట్టుంది. అన్నీ తెలిసీ ఓడిపోయా! బిగ్‌బాస్ టైటిల్ మిస్సయినందుకు బాధగా ఉంది. ఇప్పటికీ అందులోంచి బయటపడలేదు. బిగ్‌బాస్ నుంచి రాగానే ‘పుష్ప’ సినిమాలో అవకాశం గురించి పిలిచి మాట్లాడారు. స్టార్ మా వాళ్లు కూడా ఓ డాన్స్ షోలో చేయమన్నారు. కానీ ఈ సీజన్ అయ్యేంత వరకు ఏదీ చేసే ఆసక్తి లేదని ఒప్పుకోలేదు. బిగ్‌బాస్ తర్వాత ఈ సీజన్ స్పెషల్‌గా ‘స్టార్ మా పరివారం’ ద్వారానే మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.
…? ప్రవళిక వేముల