అగ్ర హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో తమన్నా నాయికగా నటిస్తుండగా…చిరంజీవి సోదరి పాత్రను కీర్తి సురేష్ పోషిస్తున్నది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కావాలి. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో మరో నెల రోజులు విడుదల తేదీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది.
ఏప్రిల్లో కాకుండా మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం. దీనిపై చిత్ర బృందం ప్రకటన చేయాల్సిఉంది. అనివార్య కారణాలతోనే ఈ ఆలస్యం తప్పడం లేదన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఇటీవలే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో మంచి విజయాన్ని అందుకున్నారు. అదే ఉత్సాహంలో ఈ సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు.