గురువారం అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన తాజా చిత్రం ‘భీమ్లానాయక్’ లోని తొలిగీతాన్ని విడుదల చేశారు. ‘సెభాష్…ఆడ గాదు..ఈడ గాదు అమీరోళ్ల మేడాగాదు…ఇరగదీసె వీడి ఫైర్ సల్లగుండ..ఖాకీ డ్రెస్ పక్కన బెడితే వీడే పెద్ద గుండా..’ అంటూ సాగే ఈ గీతంలోని సాకి జానపద శైలిలో ఆకట్టుకుంది. భీమ్లానాయక్ వ్యక్తిత్వాన్ని, ధైర్యసాహసాల్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ గీతానికి తమన్ స్వరాల్ని సమకూర్చారు. పవన్‌కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలందించారు. నిత్యామీనన్, ఐశ్వర్యరాజేష్ కథానాయికలు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రేక్షకులముందుకు రానుంది.
ఏప్రిల్ 29న ‘హరిహర వీరమల్లు’
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. యాభైశాతం చిత్రీకరణ పూర్తయిందని, త్వరలో కొత్త షెడ్యూల్‌ను ఆరంభిస్తామని నిర్మాత ఎ.దయాకర్ రావు తెలిపారు. మైత్రిమూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్‌శంకర్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ ఓ చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని సైతం గురువారం విడుదల చేశారు. ఇక సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటించబోతున్న కొత్త చిత్రాన్ని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ‘యథా కాలమ్..తథా వ్యవహారమ్..’ అనే క్యాప్షన్‌తో గురువారం విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.