‘ఏడాది నుంచి ‘కింగ్డమ్’ గురించి ఆలోచిస్తుంటే ఒకటే అనిపిస్తాంది. మన తిరుపతి ఏడు కొండల వెంకన్న స్వామిగానీ..ఈ ఒక్కసారి నా పక్కనుండి నన్ను నడిపించినాడో.. చాలా పెద్దొన్నై పూడుస్తా సామీ.. టాప్ల పోయి కూసుంటా. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, నిర్మాత నాగవంశీ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. ఇక మిగిలింది వెంకన్నస్వామి దయ, మీ అందరి ఆశీస్సులు. ఆ రెండూ ఉంటే మనల్ని ఎవరూ ఆపేదేలే.
ఇక నాలుగు రోజులే ఉంది. అందరం థియేటర్లలో కలుద్దాం’ అంటూ అచ్చమైన రాయలసీమ యాసలో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యానికి, ఆనందానికీ లోను చేశారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ అడ్వెంచర్ ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటైర్టెన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ క్రియేషన్స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం తిరుపతిలో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘రెండున్నరేళ్ల కష్టం ఇది. అయిదేళ్లు గౌతమ్ కష్టపడి రాసిన కథ ఇది. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా అందరికీ నచ్చుతుందని నమ్మకంతో ఉన్నా. దేవరకొండ విజయ్‌లో ఆడియన్స్ చూడాలనుకుంటున్న అంశాలన్నీ ఇందులో ఉంటాయి’ అని తెలిపారు.