Balagam | చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది ‘బలగం’. విమర్శకుల ప్రశంసలతో పాటు ఇప్పుడు పలు పురస్కారాలను గెల్చుకుంటున్నది. తాజాగా అంతర్జాతీయ వేదికపై ఈ సినిమా సత్తా చాటింది. లాస్ ఏంజెలీస్ సినిమాటోగ్రఫీ అవార్డ్స్‌లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ సినిమాటోగ్రఫీ అవార్డులు దక్కించుకుంది.
ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దర్శకుడు వేణు యెల్దండి, సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు, ఇతర చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపింది. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. గత నెల 3వ తేదీన ఈ సినిమా తెరపైకి వచ్చింది.