David Warner | ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును 2016లో విజేతగా నిలపడమే కాకుండా తెలుగువారి హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇక కరోనా లాక్డౌన్ టైంలో టాలీవుడ్ మూవీస్ నుంచి డేవిడ్ భాయ్ చేసిన రీల్స్, టిక్ టాక్ వీడియోలు ఫుల్ వైరల్గా మారాయి. దీంతో అప్పట్లో డేవిడ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వమని ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు. ఇక రీసెంట్గా దర్శక దిగ్గజం రాజమౌళితో క్రెడ్ యాడ్ చేసి నవ్వులు పూయించాడు. ఇదిలావుంటే తాజాగా డేవిడ్ వార్నర్ ఒక టాలీవుడ్ సినిమా చేస్తున్నట్లు సమాచారం అందింది. రీసెంట్గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పుష్పలో నేను నటించట్లేదు కానీ ఒక తెలుగు సినిమా అయితే నేను చేస్తున్నా అంటూ చెప్పుకోచ్చాడు.
అయితే డేవిడ్ వార్నర్ చేసే తెలుగు సినిమా ఏంటా అని అభిమానులు తెగ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే డేవిడ్ వార్నర్ నటిస్తున్న సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. టాలీవుడ్ నటుడు నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్(RobinHood). భీష్మ సినిమా తర్వాత నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను వరల్డ్ వైడ్గా 2024 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే ఈ సినిమాలోనే డేవిడ్ వార్నర్ నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఒక డాన్ క్యారెక్టర్లో డేవిడ్ వార్నర్ కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.