AS Ravi Kumar | ఇటీవల సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు గుండెపోటుతో కన్నుమూస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. తాజాగా నందమూరి బాలకృష్ణతో పాటు యువ హీరోలు నితిన్, సాయి దుర్గా తేజ్, రాజ్ తరుణ్ వంటి యువ హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూసారు. గత రాత్రి (జూన్ 10వ తేదీ) కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన మరణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది ఉంది. ఏఎస్ రవి కుమార్ చివరిగా రాజ్ తరుణ్ తో తిరగబడరా స్వామి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు
ఏఎస్ రవి కుమార్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు చెబుతున్నారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయన హఠాన్మరణం తెలుగు చిత్ర పరిశ్రమని ఎంతగానో కలచి వేస్తుంది. గత కొంత కాలంగా ఏఎస్ రవికుమార్ తన కుటుంబానికి దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఫ్యామిలీలో గొడవలు ఉన్న నేపథ్యంలో రవి కుమార్ ఒంటరిగానే ఉంటున్నారు.
ఏఎస్ రవికుమార్కి ఈ మధ్య సక్సెస్‌లు లేవు. ఈ క్రమంలో ఆయన ఒత్తిడిలో ఉన్నారని, కొంత మద్యానికి కూడా బానిసైనట్టు తెలుస్తోంది. దర్శకుడి మృతి పట్ల చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. గోపీచంద్ హీరోగా వచ్చిన `యజ్ఞం` చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన కేఎస్ రవి కుమార్ ఈ మూవీతో పెద్ద విజయం సాధించారు. ఆ తర్వాత బాలకృష్ణతో `వీరభద్ర` మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇక సాయి ధరమ్ తేజ్ తో `పిల్లా నువ్వు లేని జీవితం` మూవీని రూపొందించారు. ఇది ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత నితిన్‌తో `ఆటాడిస్తా` సినిమా చేశారు. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత తన తొలి సినిమా హీరో గోపీచంద్‌తో ‘సౌఖ్యం’ చేశారు. అది కూడా ఆశించిన విజయం సాధించలేదు.దాంతో కాస్త గ్యాప్ తీసుకొని ఇటీవల రాజ్ తరుణ్‌తో `తిరగబడరా సామీ`ని రూపొందించగా, ఇది ఫ్లాప్ అయింది. దాంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్టు సమాచారం.