Jayashankarr | తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఒక సరికొత్త ‘డివైన్ ట్రెండ్’ నడుస్తోంది. వెండితెరపై దైవత్వాన్ని, పురాణాల అంశాలను తీసుకువచ్చి ‘హనుమాన్’, ‘కాంతార’, ‘మిరాయ్’ వంటి చిత్రాలు అద్భుతమైన కలెక్షన్లను రాబడుతున్నాయి. అయితే ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఆ కోవలోనే మరో చిత్రం ‘అరి’ (ARI) అక్టోబర్ 10న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచేస్తుంది.
‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాల విజయానికి ప్రధాన కారణం వాటి క్లైమాక్స్‌లో దైవాన్ని చూపించిన తీరు. దైవత్వం అనే భావోద్వేగాన్ని కథ, కథనాలకు జోడించి, క్లైమాక్స్ షాట్లతో ప్రేక్షకులు మెస్మరైజ్ అయ్యేలా చేయడంతో, ఆ చిత్రాల ఫలితాలు మారిపోయాయి. భగవంతుడి ఆగమనాన్ని, లేదా ఆయన శక్తిని ట్రైలర్లలో, తెరపై చూపించే ఈ ట్రెండ్ ఇప్పుడు ‘అరి’కి కూడా కలిసి వచ్చింది. లేటెస్ట్గా విడుదలైన ‘అరి’ ట్రైలర్ కూడా ఈ డివైన్ ఎమోషన్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఇందులో ఆరు విభిన్న పాత్రలు, వాటి నేపథ్యాలను చూపిస్తూ, ఆ క్యారెక్టర్లను కలిపే మరో పాత్రగా శ్రీకృష్ణుడి అంశాన్ని ప్రవేశపెట్టారు. ట్రైలర్లో కృష్ణుడే నేల మీదకు దిగినట్టుగా చూపించిన షాట్ చూసి ప్రేక్షకులు గూస్బంప్స్ తెచ్చుకున్నారనడంలో సందేహం లేదు. ఈ షాట్ ‘హనుమాన్’, ‘మిరాయ్’ తరహాలో మరో పెద్ద హిట్‌కు నాంది పలుకుతుందనే ఆసక్తిని రేపింది.
‘అరి’ చిత్రం కేవలం దైవత్వం చుట్టూ తిరిగే కథ కాదట. ఇందులో దర్శకుడు ఏకంగా ఏడేళ్లుగా పరిశోధన చేసిన అంశం ఉంది. ‘అరి షడ్వర్గాలు’ అనే పౌరాణిక కాన్సెప్ట్‌ను తీసుకొని, దానికి నేటితరం కథను జోడించినట్టు తెలుస్తోంది. పురాణేతిహాసాల్లో చెప్పబడిన షడ్వర్గాలు ఏమిటి, వాటికి పరిష్కారం ఏంటి, ఆ సందేశాన్ని నేటి సమాజానికి దర్శకుడు ఎలా చూపించబోతున్నాడు అనే ప్రశ్నలు అందరిలోనూ ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని ‘చిన్నారి కిట్టయ్య’ పాట ఎంతగానో వైరల్ అయింది. వినోద్ వర్మ, అనసూయ, సాయి కుమార్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి అనుభజ్ఞులైన నటీనటులు నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ‘అరి’ చిత్రం అక్టోబర్ 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘అరి’ చిత్రం కూడా ‘హనుమాన్’, ‘మిరాయ్’ వలె బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.