విరామం తర్వాత ఇటీవల ‘క్వాల’ అనే చిత్రంలో కనిపించింది బాలీవుడ్ నాయిక అనుష్క శర్మ. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘చక్దా ఎక్స్ప్రెస్’. మనోజ్ ఆనంద్, అతుల్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ జులన్ గోస్వామి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం బౌలింగ్లో శిక్షణ తీసుకుంది అనుష్క. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉందీ సినిమా. ఈ సినిమా గురించి, తన కెరీర్ గురించి అనుష్క శర్మ తాజా ఇంటర్వ్యూలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ…‘వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాక నటిగా నా ప్రాధామ్యాలు మారిపోయాయి. పాప వామికను చూసుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. గతంలోలా పోటీ పడి నటించే ఆలోచన లేదు. మంచి అవకాశాలు వస్తేనే నటిస్తాను. ఇక్కడ నాయికగా ఉండాలని, ఏదో నటించాలని మాత్రం సినిమాలు ఒప్పుకోను. ఎందుకంటే అలా వృథా చేసేంత సమయం నా దగ్గర లేదు’ అని చెప్పింది. ఓటీటీ మూవీగా ‘చక్దా ఎక్స్ప్రెస్’ తెరకెక్కుతున్నది.