Anurag Kashyap | సుదీప్తో సేన్ దర్శకత్వంలో హీరోయిన్ ఆదా శర్మ ప్రధాన తెరకెక్కిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ ఈ సినిమాపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరో వైపు భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్నది. ఇటీవల లోకనాయకుడు కమల్ హసన్ స్పందిస్తూ సినిమాను ప్రచార చిత్రంగా కొట్టిపడేశారు. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పేరు చేసింది. ‘ది కేరళ స్టోరీ’ కేవలం ప్రచార చిత్రమేనన్నారు. నేటికాలంలో రాజకీయాల నుంచి ఎవరినీ తప్పించడం లేమన్న కశ్యప్.. ఈ రోజుల్లో సినిమా రాజకీయాలకు అతీతంగా ఉండడం చాలా కష్టమన్నారు.
కేరళ స్టోరీ లాంటి ప్రచార చిత్రాలు చాలానే రూపొందుతున్నాయని, అయితే దేన్నైనా నిషేధించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. సినిమా ప్రచార చిత్రం అనే అభిప్రాయంపై తాను గట్టిగానే నిలబడి ఉన్నానన్నారు. ఒక ఫిల్మ్ మేకర్‌గా తాను ప్రచార చిత్రాన్ని తిప్పికొట్టే సినిమా తీయాలనుకోవడం లేదన్నారు. వాస్తవికత ఆధారంగా సినిమా ఉండాలని అనురాగ్ కశ్యప్ పేర్కొన్నారు. దేశంలోని సామాజిక-రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మీకు నచ్చిన సినిమాలు తీయగలరా? అని ప్రశ్నించగా.. ‘నిజాయితీగా ఉంటే.. మీరు చేయగలరు’ అని పేర్కొన్నారు.
ప్రచార చిత్రానికి ఎదురుతిరిగేలా సినిమా తీయడంలో నిజాయితీ ఉండొచ్చని, నిజం చెప్పాలంటే పోరాడలేమని అన్నారు. ఇదిలా ఉండగా.. వివాదాస్పద కథ నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ని బెంగాల్ ప్రభుత్వం నిషేధించింది. అదే సమయంలో తమిళనాడులో శాంతిభద్రతల నేపథ్యంలో సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని థియేటర్స్ ఓనర్స్ నిర్ణయించారు. అయితే, బెంగాల్లో సినిమాను నిషేధించడంపై బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సినిమా చూసే వారి భద్రతను నిర్ధారించాలని తమిళనాడుకు సూచించింది.