టాలీవుడ్లో వరుస విషాద సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకరి మృతి విషయాన్ని మరచిపోకముందే ఇంకొకరు కన్నుమూస్తున్నారు. తాజాగా జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన జూనియర్ ఆర్టిస్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ 306, 509, 417 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
వివరాలలోకి వెళితే బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న సదరు జూనియర్ ఆర్టిస్ట్‌కు కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. కిరణ్ తనని పెళ్లి చేసుకుంటాడని భావించిన అనురాధ కొన్నాళ్లుగా అతనితోనే ఉంటుంది. అయితే ఇటీవల అతడు మరో యువతిని ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఆమె ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. అతనితో తీవ్ర వాగ్వాదం పెట్టుకుంది. కిరణ్ ఆమెపై గట్టిగా అరిచి అక్కడ నుండి వెళ్లిపోవడంతో అనురాధ మనస్తాపానికి గురై తన గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.